Money Laundering Case: వేతనం తీసుకోని పిచ్చోడిని: పాకిస్థాన్‌ పీఎం

29 May, 2022 14:45 IST|Sakshi

లాహోర్‌: పంజాబ్‌ సీఎంగా ఉండగా వేతనం కూడా తీసుకోకుండా మూర్ఖుడిలా వ్యవహరించానంటూ పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్‌ తనను తాను నిందించుకున్నారు. రూ.1,600 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో లాహోర్‌ ప్రత్యేక కోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘పన్నెండున్నరేళ్ల పాటు వేతనం, ఇతర లబ్ధిని పొందలేదు. నేనొక మూర్ఖుడిని. కోట్లాది రూపాయల మనీ లాండరింగ్‌ కేసులో నన్ను నిందితుడిగా మార్చారు. ఆ దేవుడే నన్ను పాకిస్థాన్‌ ప్రధానిగా చేశారు’ అని చెప్పుకున్నారు. 

అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణల నేపథ్యంలో షరీఫ్‌, ఆయన కుమారులు హంజా, సులేమాన్‌లపై 2020 నవంబరులో ఫెడరల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(FIA)మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. హంజా షరీఫ్ ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు., సులేమాన్ యూకేలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి శనివారం ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. షెహబాజ్‌ కుటుంబానికి చెందిన 28 బినామీ ఖాతాలను తాము గుర్తించామని ఎఫ్‌ఐఏ కోర్టుకు తెలిపింది. 2008 నుంచి 2018 మధ్య ఈ బినామీ ఖాతాల ద్వారా ఆయన 14 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు అక్రమ సంపాదన ఆర్జించినట్లు ఆరోపించింది.
చదవండి: నైజీరియా చర్చిలో తొక్కిసలాట.. 31 మంది మృతి 

మరిన్ని వార్తలు