ఇండియా పేరు కోసం పాకిస్తాన్ ఎదురుచూపులు.. ఆ పేరు మీకు వద్దంటే చెప్పండి..

6 Sep, 2023 19:05 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండురోజులుగా ఇండియా పేరుని భారత్‌గా మార్చే విషయమై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంటే సోషల్ మీడియాలో మరో వార్త దావానలంలా వ్యాపించింది. ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో అధికారికంగా వదులుకుంటే పాకిస్తాన్ ఆ పేరుని చేజిక్కించుకోవాలని అనుకుంటోందట. ఇదిలా ఉండగా దేశం పేరు మార్పుపై కేంద్రం నుంచైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.  

    

ఆహ్వానంతో మొదలైంది.. 
భారత దేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి భావం నుంచి అతిధులకు చేరిన ప్రత్యేక డిన్నర్ ఆహ్వానంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించింది కేంద్రం. ఈ నేపథ్యంలో సౌత్ ఏషియా ఇండెక్స్  అనే ఒక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ ఒకటి ప్రత్యక్షమైంది. 

మాకే హక్కుంది..
ఒకవేళ భారతదేశం ఇండియా అనే పేరుని ఐక్యరాజ్యసమితి సమక్షంలో మార్చుకుని భారత్ అని నామకరణం చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే పాకిస్తాన్ దేశం తమ దేశానికి ఇండియా అని పేరు పెట్టుకోవచ్చని స్థానిక మీడియా తెలిపినట్లు రాశారు. చాలాకాలంగా పాకిస్తాన్ జాతీయవాదులు ఇండియా అనేది సింధు ప్రాంతాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ పేరు మీద తమకే ఎక్కువ హక్కులు ఉన్నాయని చెబుతూ వస్తోంది. 

అక్కడ ఊరే లేదు.. 
ఇక ఈ పోస్టుపై సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది. ఒకవేళ పాకిస్తాన్ ఇండియా పేరు పెట్టుకుంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ పేరు పెట్టుకుంటుంది. అపుడు రష్యా ఆఫ్ఘనిస్తాన్ పేరును పెట్టుకోవచ్చంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారొక యూజర్. మరో వ్యక్తి అయితే పెరు మారినా పాకిస్తాన్ తలరాత మాత్రం మారదులే అని రాశారు. ఇక భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్  అయితే ఈ ట్వీట్‌కు రిప్లై ఇస్తూ..  అక్కడ గ్రామమే లేదు అంతలోనే దాన్ని దోచుకోవడానికి దొంగలు తయారయ్యారని రాశారు.       

ఇది కూడా చదవండి: అమెరికాలో అసలేం జరుగుతుంది?బాంబుల్లా పేలుతున్న పుచ్చకాయలు

మరిన్ని వార్తలు