పాకిస్థాన్‌లో దుర్భర పరిస్థితులు.. ప్లాస్టిక్‌ కవర్లలో వంట గ్యాస్‌ నిల్వ చేసుకుంటున్న ప్రజలు

3 Jan, 2023 09:30 IST|Sakshi

ఇస్లామాబాద్‌: మన పొరుగు దేశం పాకిస్థాన్‌లో ప్రజల జీవితంపై ఆర్థిక సంక్షోభం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ దృశ్యాలే నిదర్శనం. సంక్షోభం తలెత్తడం వల్ల రాయితీపై అందించే నిత్యావసర వస్తువులపై పాక్‌ ప్రభుత్వం కోత పెడుతోంది. మరోవైపు ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ దుర్భర పరిస్థితుల్లో ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకునేందుకు ఆ దేశ ప్రజలు వంటగ్యాస్‌ను ప్లాస్టిక్‌ కవర్లలో నిల్వ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

పాకిస్థాన్‌లోని వాయస్వ ఖైబెర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో స్థానికులు ఎల్‌పీజీ గ్యాస్‌ను నిల్వ చేసుకునేందుకు పెద్ద పెద్ద ప్లాస్టిక్‌ బ్యాగులను తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. దేశ గ్యాస్‌ పైపులైన్‌ నెట్‌వర్క్‌కు అనుసంధానమైన దుకాణల వద్దకు ప్లాస్టిక్‌ బ్యాగులను తీసుకెళ్లి అందులో వంట గ్యాస్‌ను నింపించుకుంటున్నారు. అందులోంచి లీకేజీ లేకుండా విక్రయదారులు బ్యాగులకు బిగుతుగా నాజల్‌, వాల్వ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాతే వాటిని ప్రజలకు విక్రయిస్తున్నారు. ప్లాస్టిక్‌ బ్యాగుల్లో 3-4 కేజీల గ్యాస్‌ నింపేందుకు ఒక గంట సమయం పడుతోంది. 

ఈ వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా వైరల్‌గా మారింది. ‘పాకిస్థాన్‌లో సిలిండర్లలో కాకుండా ప్లాస్టిక్‌ బ్యాగుల్లో వంట గ్యాస్‌ నింపుతున్నారు. గ్యాస్‌ పైపులన్‌ నెట్‌వర్క్‌తో అనుసంధానమైన దుకాణాల్లో ప్లాస్టిక్‌ బ్యాగుల్లో గ్యాస్‌ నింపుతున్నారు. చిన్న ఎలక్ట్రిక్‌ సక్షన్‌ పంప్‌ సాయంతో వీటిని వంట గదిలో వినియోగిస్తున్నారు.’అని రాసుకొచ్చారు. అత్యంత ప్రమాదకరమైన రీతిలో వీటిని ఉపయోగిస్తున్నారని వస్తోన్న వార్తలను అధికారులు కొట్టిపారేశారు. ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగంపై ఆంక్షలు విధించినట్లు స్థానిక మీడియాతో వెల్లడించారు.

ఇదీ చదవండి: ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. ముగ్గురు మృతి

మరిన్ని వార్తలు