ముకుల్‌ ఆర్య.. పాలస్తీనా భారత రాయబారి హఠాన్మరణం, మృతిపై అనుమానాలు?

7 Mar, 2022 07:23 IST|Sakshi

పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్‌ ఆర్య ఆకస్మిక మరణం చెందారు. రమల్లహ్ భవనంలో ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ముకుల్ మరణానికి గల కారణాల గురించి ఇటు భారత విదేశాంగ శాఖతో పాటు పాలస్తీనా ప్రభుత్వంగానీ స్పష్టత ఇవ్వలేదు. 

ఇదిలా ఉంటే ఇరు దేశాలు మాత్రం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ఆయన భౌతికకాయాన్ని భారత్​కు తరలించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే పాలస్తీనాలో భారత రాయబారి ముకుల్‌ ఆర్య మృతిని ధ్రువీకరిస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాన‌ని విదేశాంగ మంత్రి జైశంకర్ ట్వీట్ చేశారు.  ముకుల్‌ ఆర్య ప్రతిభావంతుడైన అధికారి అని.. ఆయ‌న కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నట్లు జైశంకర్ తెలిపారు. స్నేహపూర్వక భారత ప్రభుత్వానికి, ప్రతినిధి ఆర్య కుటుంబానికి, సంతాపాన్ని ప్రకటించారు విదేశాంగ వ్యవహారాలు, వలసదారుల మంత్రి డాక్టర్ రియాద్ అల్-మాలి.  

 

Mukul Arya మృతదేహాన్ని అంత్యక్రియల కోసం భారతదేశానికి తరలించే ఏర్పాట్లను పూర్తి చేయడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అధికారిక సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు ముకుల్ మృతి పట్ల పాలస్తీనా ప్రభుత్వం విచారణ వ్యక్తం చేసింది. ఆయన మరణంపై దర్యాప్తు జరిపాలని అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ప్రధాని సైతం దర్యాప్తు విభాగాలను ఆదేశించారు. 


 
ముకుల్‌ నేపథ్యం.. 
ఢిల్లీలో పుట్టి, పెరిగిన ముకుల్‌ ఆర్య.. ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదివాడు. 2008 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్‌కు చెందిన వారు. ఢిల్లీ విదేశాంగ విభాగాల్లోపని చేసిన ఆర్య.. యునెస్కో(పారిస్‌)లో శాశ్వత ప్రతినిధిగా పని చేశారు. అంతేకాదు  కాబూల్, మాస్కోలోని రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వర్తించారు.

మరిన్ని వార్తలు