WHO: కరోనా మారుతోంది.. ఒమిక్రాన్‌ వేరియెంట్లు ట్రేస్‌ కావట్లేదు.. వ్యాక్సినేషన్‌ స్పీడ్‌ పెంచండి

30 Jun, 2022 07:43 IST|Sakshi

జెనీవా: కరోనా వైరస్‌.. వైద్య నిపుణులు అనుకున్నదాని కంటే మొండి ఘటంగా మారుతోంది. మహమ్మారిగా కరోనా కథ ముగిసిపోవడం లేదు. కేవలం రూపం మాత్రమే మార్చుకుంటోంది అంతే. ప్రస్తుతం 110 దేశాల్లో కేసులు వెల్లువలా పెరిగిపోతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది.

ఈ మహమ్మారి మారుతోంది కానీ అది ముగియలేదు. #COVID19 వైరస్‌ని ట్రాక్ చేయగల మా(డబ్ల్యూహెచ్‌వో) సామర్థ్యం ముప్పు అంచుకి చేరుకుంది. ఒమిక్రాన్‌, దాని నుంచి పుట్టుకొస్తున్న వేరియెంట్లను ట్రాక్‌ చేయడం, విశ్లేషించడం చాలా కష్టతరంగా మారుతోంది. కాబట్టి ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ ట్రెడోస్‌ ప్రకటించారు. 

బీఏ.4, బీఏ.5.. కేసులు వెల్లువలా పెరిగిపోతున్నాయ్‌. కానీ, కొత్త వేరియెంట్ల జాడను ట్రేస్‌ చేయలేకపోతున్నాం. వాటిలో ముప్పు కలిగించే వేరియెంట్లు లేకపోలేదు. దాదాపు 110 దేశాల్లో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుదల గతంతో పోలిస్తే.. 20 శాతం అధికంగా పెరిగిపోయాయి. కేవలం డబ్ల్యూహెచ్‌వో పరిధిలోని ఆరు రీజియన్లలో మూడింటిలో మరణాలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొవిడ్‌ ప్రొటోకాల్స్‌ పాటించడం ఒక్కటే రాబోయే ముప్పును తగ్గించగలదు.

గత 18 నెలల నుంచి.. 12 బిలియన్‌ వ్యాక్సిన్స్‌ వ్యాక్సిన్‌ డోసుల ప్రక్రియ పూర్తైంది. కనీసం 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని.. తద్వారా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడమో, జరగబోయే నష్ట తీవ్రతను తగ్గించడమో చేసుకోవచ్చని ప్రపంచ దేశాలకు పిలుపు చేయాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపు ఇచ్చింది. మరోవైపు భారత్‌లోనూ 14వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదు అవుతుండడం చూస్తున్నాం.

మరిన్ని వార్తలు