ఓ ప్రాణం కాపాడిన బాలిక సమయస్ఫూర్తి

23 Sep, 2020 16:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సమయ స్ఫూర్తి కలిగిన వారు జీవితంలో విజయం సాధించడమే కాకుండా ఎదుటి వారి జీవితాలను రక్షించి ప్రశంసలు అందకుంటారని దక్షిణ ఇంగ్లండ్‌లోని డార్‌సెట్‌ నగరానికి చెందిన 15 ఏళ్ల నవోమీ జుప్‌ అనే బాలిక నిరూపించారు. బతుకుతెరవు కోసం గత రెండేళ్లుగా ఇంటింటికి తిరిగి న్యూస్‌ పేపర్‌ వేస్తున్న ఆ బాలిక రోజూలాగే ఈ నెల 15వ తేదీన కూడా క్రైస్ట్‌చర్చ్‌ ప్రాంతంలో ఇంటింటికి పేపర్‌ వేస్తూ వెళ్లింది. ఓ ఇంటి వద్ద పేపర్‌ బాక్సులో పేపర్‌ వేయబోతుండగా, అంతకుముందు రోజు పేపర్‌ కూడా కనిపించింది. ఆ ఇంటిలో ఉంటున్న వారెవరో పేపర్‌ కోసం బయటకు రాలేక పోయారని ఆమెకు అర్థం అయింది. వెంటనే ఆ బాలిక 101కు ఫోన్‌చేసి పోలీసులకు ఈ విషయం చెప్పింది. అనారోగ్యం లేదా మరో కారణం వల్లనో ఆ ఇంట్లోని వారు బయటకు రాలేకపోయి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. 
(చదవండి: వినూత్న ప్రచారం.. ముందు పేజీలో మాస్క్‌)

పోలీసులు హుటాహుటిన వచ్చి ఆ ఇంట్లోకి వెళ్లగా ఓ మంచం మీద అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న ఓ వద్ధుడు కనిపించారు. పోలీసులు వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి ఆ వద్ధుడిని ఆస్పత్రికి తరలించారు. ఆ ఇంట్లో ప్రభుత్వ పింఛనుదారుడు ఒక్కరే నివసిస్తున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని బుధవారం నాడే ఇంటికి చేరుకున్నారు. సమయస్ఫూర్తిని ప్రదర్శించి నిండు ప్రాణాలను రక్షించినందుకు ఆ ప్రాంతం పోలీసు అధికారి ఆమెను ప్రశంసిస్తూ ‘ప్రత్యేక గుర్తింపు పత్రం’తో సత్కరించారు. లాక్‌డౌన్‌లో కూడా పేపర్‌ ఆపకుండా తన విధులను సక్రమంగా నిర్వహించిందంటూ ఆ ప్రాంతం వాసులు కూడా ఆమెను ప్రశంసించారు. 
(చదవండి: రాబిన్‌ హుడ్‌ అవతారమెత్తిన డీజీపీ )

మరిన్ని వార్తలు