వీడియో: మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని.. ఎవరికీ దక్కని అరుదైన స్వాగతమది

21 May, 2023 21:27 IST|Sakshi

ఫసిఫిక్‌ ద్వీప దేశం పాపువా న్యూగినియాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్‌ మరాపే.. మోదీని ఆలింగనం చేసుకుంటూ.. ఆయన పాదాలను తాకుతూ స్వాగతించారు. వాస్తవానికి పాపువా న్యూగినియాలో సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశంలోకి వచ్చే ఏ నాయకుడికి ఉత్సవ స్వాగతం ఇవ్వదు. కానీ మోదీ కోసం ఆ సెంటిమెంట్‌ను పక్కనపెట్టారు. 

అక్కడి కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటలకు చేరకున్న ప్రధాని మోదీకి మాత్రం మినహయింపు ఇచ్చింది. అంతేగాదు పసిఫిక్‌ ద్వీప దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని అయిన మోదీకి న్యూగినియా ప్రధానిచే విశేష స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఇతర ప్రముఖులను కలిసేందుకు వెళ్లేముందు కూడా మరాపే మోదీని మరోసారి ఆలింగనం చేసుకున్నారు.

ఈ మేరకు మోదీ ట్వీట్టర్‌ వేదికగా..నేను  పాపువా న్యూగినియా చేరుకున్నాను. విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు ప్రధాని జేమ్స్‌ మరాప్‌కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు స్వాగతం పలికేందుకు ఆయన చేసిన ప్రత్యేక అభివాదాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా పర్యటన సందర్భంగా ఈ దేశంతో భారత్‌ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను అని మోదీ ట్వీట్‌ చేశారు.

న్యూగినియాలో మోదీకి 19 తుపాకులు గౌరవ వందనం, లాంఛనప్రాయం స్వాగతం గార్డ్‌ ఆఫ్‌ హానర్‌ తోసహా ప్రధాని జేమ్స్‌ మరాపే చేసిన ప్రత్యేక అభివాదాన్ని స్వీకరించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తెలిపారు. ఇదిలా ఉండగా, ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్‌ఐపిఐసి-FIPIC) మూడో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆదివారం న్యూగినియా చేరుకున్నారు మోదీకి. సోమవారం ఈ శిఖరాగ్ర సమావేశాంలో నరేంద్ర మోదీ, జేమ్స్‌ మరాపే ఆతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో జేమ్స్‌ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడం తోపాటు పాపువా న్యూగినియా గవర్నర్‌ జనరల్‌ బాబ్‌ దాడేతో భేటీ కానున్నారు మోదీ.

అదీగాక సోమవారం నాటి చర్చల్లో వాతావరణ మార్పులు, అభివృద్ధిపైన ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ ఆతిథ్యమిచ్చింది. కాగా, అంతకుమునుపే మోదీ ఈ శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యేందుకు 14 పసిఫిక్‌ ద్వీప దేశాలు(పీఐసీ) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ ఫిజి పర్యటన సందర్భంగా ప్రారంభించిన ఎఫ్‌ఐపీఐసీ సదస్సులో మొత్తం 14 దేశాల నాయకులు పాల్గొంటారు.  

(చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్‌ అడిగిన జో బైడెన్‌!)

మరిన్ని వార్తలు