పారిస్‌లో 700 కి.మీ. ట్రాఫిక్‌ జామ్‌

1 Nov, 2020 02:51 IST|Sakshi
పారిస్‌లో కూడళ్ల వద్ద బారులుతీరిన వందలాది వాహనాలు

ఫ్రాన్స్‌లో రెండో సారి లాక్‌డౌన్‌

లక్షలాది మంది సొంతూళ్ళకు పయనం

పారిస్‌: గత కొంతకాలంగా యూరప్‌లో కోవిడ్‌ విజృంభిస్తుండడంతో ఫ్రాన్స్‌లో రెండోసారి లాక్‌డౌన్‌ ప్రకటించారు. శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో గురువారం నుంచే లక్షలాది మంది జనం సొంతూళ్ళకు పయనమయ్యారు. దీంతో గురువారం రాత్రి నుంచి పారిస్‌ చుట్టూ 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మక్రాన్‌ ఏడు నెలల కాలంలో రెండోసారి లాక్‌డౌన్‌కి డిక్రీ జారీచేయగా దీన్ని పార్లమెంటు ఆమోదించింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతిరోజూ తాజాగా 50,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో 13,31,884 కేసులు నమోదు కాగా, 36,565 మంది మరణించినట్లు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. కోవిడ్‌ ఆంక్షలు డిసెంబర్‌ 1 వరకు అమలులో ఉంటాయని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి, ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వం కోరింది.

ఫ్రాన్స్‌కి చెందిన 6.7 కోట్ల మంది ప్రజలు పూర్తిగా ఇళ్ళకే పరిమితం కావాలనీ, ఒకరిళ్ళకు ఒకరు వెళ్ళకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. నిత్యావసర సరుకుల కోసం, మందుల కోసం, వ్యాయామం కోసం ఒక గంట మాత్రమే బయటకు అనుమతిస్తామని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఆహారం ఇతర సరుకుల కోసం జనమంతా సూపర్‌మార్కెట్లకు ఎగబడ్డారు. లక్షలాది మంది సొంతూళ్ళకు పయనమయ్యారు. జనమంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయాయి.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు