పెను విషాదం: ప్యాసింజర్‌ రైలును ఢీకొన్న గూడ్స్‌.. పదుల సంఖ్యలో మరణాలు

1 Mar, 2023 08:57 IST|Sakshi

రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 32 మంది మృతిచెందగా 80 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ విషాద ఘటన గ్రీస్‌ దేశంలో చోటుచేసుకుంది. ఈ ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

వివరాల ప్రకారం.. గ్రీస్‌లోని టెంపే ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్యాసింజర్​ రైలు, మరో గూడ్స్​ ట్రైన్​ని ఢీకొట్టింది. రెండు వేగంలో ఉండటంతో ప్రమాదం ధాటికి అనేక బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని బోగీలకు మంటలు అంటుకున్నాయి. కాగా.. ప్రమాదానికి గురైన ప్యాసింజర్​ రైలు.. ఏథెన్స్​ నుంచి థెస్సలోనికి అనే ప్రాంతానికి వెళుతున్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో అందులో 350మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

ఇక, ఈ ప్రమాద ఘటనపై థెస్సాలీ ప్రాంత గవర్నర్ కాన్‌స​ంటీనోస్‌ అగోరాస్టోస్ స్పందించి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అగోరాస్టోస్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాద ధాటికి ప్యాసింజర్ రైలులోని మొదటి నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పాయి. మొదటి రెండు కోచ్‌లు దాదాపు పూర్తిగా ధ్వంసమయ్యాయని ఆయన తెలిపారు. దాదాపు 250 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు స్పష్టం చేశారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే గ్రీస్‌ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ  ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు