చట్టాలకు లోబడే నేవీ ఆపరేషన్స్‌: పెంటగాన్‌

11 Apr, 2021 06:05 IST|Sakshi

వాషింగ్టన్‌: భారత్‌లోని లక్షద్వీప్‌ సమీపంలో ‘ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ ఆపరేషన్‌(ఎఫ్‌ఓఎన్‌ఓపీ)’ని చేపట్టడాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్‌ సమర్థించుకుంది. అంతర్జాతీయ చట్టాలకు లోబడే ఈ చర్యను చేపట్టినట్లు తెలిపింది. ‘క్షిపణి విధ్వంసక నౌక ‘జాన్‌ పాల్‌ జోన్స్‌ భారతీయ జలాల్లో ఎఫ్‌ఓఎన్‌ఓపీలో పాల్గొంది. తద్వారా ఆ జలాల పరిధిపై భారత్‌ పేర్కొంటున్న మితిమీరిన హక్కును సవాలు చేశాం.

ఎఫ్‌ఓఎన్‌ఓపీ ద్వారా అంతర్జాతీయ చట్టాలు గుర్తించిన సముద్ర జలాల్లో నేవిగేషన్‌కు ఉన్న హక్కులను, చట్టబద్ధ వినియోగాన్ని నిర్ధారించాం’ అని అమెరికా నౌకాదళానికి చెందిన 7వ ఫ్లీట్‌ ఏప్రిల్‌ 7న ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌ తీవ్ర అభ్యంతరం తెలపడంపై అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి జాన్‌ కిర్బీ స్పందించారు. ‘మాల్దీవులకు సమీపంలో ఆ దేశ ఈఈజెడ్‌ పరిధి లోపల ఎటువంటి అనుమతి తీసుకోకుండానే సాధారణ ఆపరేషన్స్‌ చేపట్టడం ద్వారా నేవిగేషన్‌కు ఉన్న స్వేచ్ఛను, హక్కులను నిర్ధారించాం’ అని తెలిపారు.
(చదవండి: భారత జలాల్లో అమెరికా దుందుడుకు చర్య)

మరిన్ని వార్తలు