భయంకర టోర్నడో బీభత్సం.. పదుల సంఖ్యలో మరణాలు..

21 Sep, 2023 08:02 IST|Sakshi

బీజింగ్‌: డ్రాగన్‌ కంట్రీ చైనాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఓ టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడో ధాటికి దాదాపు 10 మంది మృత్యువాతపడగా.. పదుల సంఖ్యలో జనాలు తీవ్రంగా గాయపడ్డారు. టోర్నడో ధాటికి వాహనాలు సైతం ఎగిరిపడ్డాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. చైనాలోని జియాంగ్స్‌ ప్రావిన్స్‌లోని సుకియాన్‌ పట్టణంలో బుధవారం మధ్యాహ్నం టోర్నడో ఒక్కసారిగా విరుచుకుపడింది. వాతావరణ మార్పుల్లో భాగంగా మెల్లగా ప్రారంభమైన సుడిగాలి క్షణాల్లోనే వేగాన్ని అందుకొని ఒక్కసారిగా పట్టణాన్ని చుట్టేసింది. ఈ క్రమంలో భారీ శబ్దంతో పాటు అధిక వేగంతో గాలి వీచింది. దీంతో, ఇళ్ల పైకప్పులు గాలిలోకి ఎగిరి పరిస్థితి భయానకంగా మారింది. అనంతరం.. కొన్ని చోట్లు భారీ వర్షం కురసింది. ఒక్కసారిగా ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు.

మరోవైపు.. సుడిగాలి ధాటికి 137 ఇళ్లు నేలమట్టం కాగా, 5,500 మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 400 మంది వారి నివాసాలను ఖాళీ చేసి వెళ్లారు. టోర్నడో విధ్వంసం అనంతరం వాహనాలు ఎక్కడికక్కడ చెల్లచెదురుగా పడ్డాయి. పలు ఇళ్లు రూపురేఖలు మారాయి. సుడిగాలి ధాటికి ఇళ్ల శకలాలు, ఇతర వస్తువులు మీదపడడంతో పలువురు రోడ్లపైనే విగతజీవులుగా మారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు