‘అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది’

5 Aug, 2020 09:30 IST|Sakshi

బీరూట్‌ పేలుళ్లు: ప్రత్యక్ష సాక్షుల భయంకర అనుభవాలు

బీరూట్‌: ‘‘నేను వరండాలో నిల్చుని ఉన్నా. ఒక్కసారిగా పరిసరాలన్నీ ప్రకంపనలకు లోనయ్యాయి. ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చేందుకు ప్రయత్నించే క్రమంలో తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు వచ్చిన అంబులెన్సుల సైరన్ల మోత ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇంతకు ముందెన్నడూ ఇలాంటిది చూడలేదు’’అని లెబనీస్‌ ఫిల్మ్‌మేకర్‌ బానే ఫఖీ మంగళవారం నాటి భయంకర అనుభవాలను గుర్తుచేసుకున్నారు. వృత్తిరీత్యా న్యూయార్క్‌లో నివసించే ఆమె ప్రస్తుతం బీరూట్‌లోని పశ్చిమ ప్రాంతంలో గల తన స్వస్థలంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆమె.. పేలుళ్ల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని.. అసలు ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థంకాలేదని వాపోయారు. (బీరూట్‌ పేలుళ్ల ఘటనపై ట్రంప్‌ స్పందన)

ఇక బీరూట్‌ పేలుళ్ల గురించి సామాజిక కార్యకర్త మయా అమ్మర్‌ మాట్లాడుతూ.. ‘‘అందరి అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. భారీ ప్రమాదం ఇది. బీరూట్‌ పోర్టు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పటికీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. బీరూట్‌ను ఇంతకు ముందెన్నడూ ఇలా చూడలేదు. అంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇంకేమీ మిగల్లేదు. పరిస్థితి దిగజారకుండా ఉండాలి. నన్ను ఇంటికి తిరిగి రావాల్సిందిగా కుటుంబ సభ్యులు, స్నేహితులు విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఎంతో మంది ఇళ్లు పోగొట్టుకుని నిరాశ్రయులయ్యారు. వారికి సాయం చేసేందుకు వెళ్తున్నా. మా గుండెల్లోని బాధను నేడు బీరూట్‌ ప్రతిబింబిస్తోంది’’అని ఆవేదన చెందారు.

పేదరికంలో మగ్గిపోతున్న ప్రజలు
లెబనాన్‌ రాజధాని బీరూట్‌ పోర్టులో మంగళవారం సంభవించిన వరుస పేలుళ్లు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. ఆకాశమంతా అరుణ వర్ణంతో నిండిపోయింది. ఘటనాస్థలి నుంచి దాదాపు 10 కిలోమీటర్ల మేర భవనాలన్నీ ధ్వంసమయ్యాయి. పేలుళ్ల ధాటికి భూమి కంపించిందని, దీని తీవ్రత 3.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా మృతి చెందగా, సుమారు 4 వేల మంది గాయపడినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పోర్టులో నిల్వ చేసిన పేలుడు పదార్థాల వల్ల ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా గత ఏడాది కాలంగా లెబనాన్‌లో ఆర్థిక సంక్షోభం, రాజకీయ అనిశ్చితి నెలకొంది. పేదరికం తారస్థాయికి చేరింది. నిత్యావసరాల కోసం ప్రజలు చెత్తకుప్పలు వెదికే పరిస్థితులు దాపురించాయి. అవినీతి, అక్రమాలు పెచ్చుమీరడంతో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజధానిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదం ప్రజల జీవితాలను మరింత గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టింది.

>
మరిన్ని వార్తలు