ఆ దేశాల ప్రజల్లో చైనా పట్ల అసంతృప్తి!

7 Oct, 2020 13:58 IST|Sakshi

ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ సర్వేలోని కీలక అంశాలు

వాషింగ్టన్‌: గత ఏడాది కాలంగా చైనా వ్యవహారశైలి పట్ల ప్రపంచ వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని అమెరికాకు చెందిన ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ వెల్లడించింది. జూన్‌ 10 నుంచి ఆగష్టు 3 వరకు సుమారు 14 దేశాల్లో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైనట్లు మంగళవారం నాటి నివేదికలో పేర్కొంది. అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, దక్షిణ కొరియా, స్పెయిన్‌, కెనడా, బ్రిటన్‌, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌, ఇటలీ, జపాన్‌ తదితర దేశాల్లోని 14 వేల మందికి పైగా ప్రజల అభిప్రాయాలను టెలిఫోనిక్‌ సంభాషణ ద్వారా సేకరించినట్లు పేర్కొంది. వీరిలో అత్యధికులు కరోనా వైరస్‌ వ్యాప్తి మూలంగా చైనా పట్ల ప్రతికూల భావనలు కలిగి ఉన్నారని తెలిపింది.(చదవండి: చైనాయే లక్ష్యంగా క్వాడ్‌ దేశాల ప్రకటన

ఈ క్రమంలో మహమ్మారి వ్యాప్తి కట్టడిలో డ్రాగన్‌ దేశం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందని 61 శాతం మంది అభిప్రాయపడగా, 37 శాతం మంది మాత్రం ఈ విషయంలో చైనాకు మంచి మార్కులే వేశారని, మిగిలిన వారు తటస్థంగా ఉన్నారని వెల్లడించింది. ఇక కోవిడ్‌-19 అత్యంత ప్రభావిత దేశాల్లో ఒకటైన అమెరికాలో ఏకంగా 84 శాతం మంది చైనా తీరుపై అసహనం వ్యక్తం చేశారని, కరోనా వ్యాప్తి నియంత్రణలో డ్రాగన్‌ దేశం విఫలమైందని అభిప్రాయపడినట్లు ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ పేర్కొంది. 

జిన్‌పింగ్‌ను అంతగా విశ్వసించలేం
ఇక 14 దేశాల్లో సర్వేలో పాల్గొన్న 78 శాతం మంది ప్రజలు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ నాయకత్వంపై సందేహాలు వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో సంబంధాల విషయంలో ఆయనను పూర్తిగా విశ్వసించలేమని స్పష్టం చేశారు. మరో 10 శాతం మంది జిన్‌పింగ్‌ నమ్మదగ్గ నాయకుడేనని పేర్కొన్నారు. అయితే జర్మనీలో మాత్రం ఈ కేటగిరీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే జిన్‌పింగ్‌కే ఎక్కువ ఓట్లు పడటం విశేషం. అక్కడ 78 శాతం ప్రజలు జిన్‌పింగ్‌పై నమ్మకం లేదని చెప్పగా, 89 శాతం మంది ట్రంప్‌ పట్ల ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మెజారిటీ దేశాల ప్రజలు కరోనా సంక్షోభంలోనూ అమెరికానే అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచిందంటూ ట్రంప్‌ పాలనపై విశ్వాసం వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు