వ్యాక్సిన్ల పనితీరుపై సీడీసీ స్టడీ, కీలక విషయాలు వెల్లడి

30 Mar, 2021 09:48 IST|Sakshi

వాషింగ్టన్‌: ఫైజర్‌, మోడర్నా టీకాలు మొదటి డోస్‌తోనే అత్యంత సమర్థవంతంగా పనిచేస్తున్నాయని యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనంలో తేలింది. మొదటి సారి రెండు షాట్స్‌ తీసుకున్న తరువాత వ్యాధి సంక్రమణ ప్రమాదం 80 శాతానికి పడిపోయిందని సీడీసీ రిపోర్టు వెల్లడించింది. ఇటీవల అమెరికాలోని మెడికల్ సిబ్బందికి ఇచ్చిన మొదటి డోస్‌లో ఈ విషయం స్పష్టమైంది. రెండు వారాల తరువాత ఇచ్చిన రెండో డోస్‌తో వ్యాధి సంక్రమణ ప్రమాదం 90 శాతానికి పడిపోయిందని పరిశోధకులు గుర్తించారు. 

లక్షణాలు లేకుండా కరోనాబారిన పడుతున్నవారికి వ్యాధి సంక్రమణ జరగకుండా ఈ టీకాలు రక్షిస్తున్నాయని పేర్కొంది.  టీకాలు తీసుకున్న నాలుగు వేల మందిపై జరిపిన అధ్యయనంలో ఈ కీలక విషయాలపై పరిశోధకులు సోమవారం నివేదిక విడుదల చేశారు. ఈ అధ్యయనంతో పలు కంపెనీలు చేస్తున్న టీకా ప్రయత్నాలు మరింత సఫలమౌతున్నట్లు సీడీసీ  డైరెక్టర్ రోషెల్ వాలెన్‌స్కీ ఒక ప్రకటనలో తెలిపారు.

2020 డిసెంబర్ 14 నుంచి మార్చి 13, 2021 వరకు, 13 వారాల వ్యవధిలో ఆరు రాష్ట్రాల్లో వాక్సినేషన్‌లో పాల్గొన్న 3,950మందిలో ఈ  ఎంఆర్ఎన్ఎ వ్యాక్సిన్ల మరింత ఎక్కువ  ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు. ఈ అధీకృత mRNA కోవిడ్‌-19 వ్యాక్సిన్లు దేశ  ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి,  ఇతర ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాధి సంక్రమణకు వ్యతిరేకంగా ప్రారంభంలోనే, గణనీయమైన రక్షణను అందించాయని వాలెన్‌స్కీ చెప్పారు.కొత్త mRNA సాంకేతికత ఒక సహజ రసాయన మెసెంజర్  సింథటిక్ రూపం, కరోనావైరస్ నుంచి రక్షించడానికి, రోగ నిరోధక శక్తిని అందించడానికి ఉపయోగపడుతుంది. అత్యవసర పరిస్ధితుల్లో ఈ టీకాలను వాడుకోడానికి  యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్ అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: జంతువుల నుంచే కరోనా!

మరిన్ని వార్తలు