భయంతో కరోనా వ్యాక్సిన్‌ను ఖతం చేశాడు!

6 Jan, 2021 17:01 IST|Sakshi

కోవిడ్‌ వ్యాక్సిన్‌తో డీఎన్‌ఏ మారుతుందని...

మోడర్నా వ్యాక్సిన్‌ 500 డోసులు నాశనం చేసిన ఫార్మసిస్ట్‌

వాషింగ్టన్‌: ఓ వైపు కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ వచ్చిందని సంతోషిస్తుండగా.. మరోపక్క టీకా సామార్థ్యం మీద జనాల్లో రోజురోజుకు అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఓ ఫార్మసిస్ట్‌ మోడర్నా వ్యాక్సిన్‌ 500 డోసులను పనికి రాకుండా చేశాడు. దాంతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇక విచారణలో సదరు ఫార్మసిస్ట్‌ మోడర్నా వ్యాక్సిన్‌ వల్ల డీఎన్‌ఏలో మార్పులు వస్తాయని తెలిసి.. వాటిని నేలపాలు చేశానని వెల్లడించాడు. వివరాలు.. స్టీవెన్ బ్రాండెన్‌బర్గ్‌గా గుర్తించబడిన ఫార్మసిస్ట్‌ విస్కాన్సిన్‌లోని గ్రాఫ్టన్‌లోని అరోరా మెడికల్ సెంటర్‌లో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఆ మెడికల్‌ సెంటర్‌లో మోడర్నా వ్యాక్సిన్‌ని భద్రపరిచారు. ఈ క్రమంలో స్టీవెన్‌ మోడర్నా వ్యాక్సిన్‌ తీసుకుంటే డీఎన్‌ఏలో మార్పులు చోటు చేసుకుంటాయని విన్నాడు. ఆ భయంతో ఫ్రిజ్‌లో ఉన్న వ్యాక్సిన్‌ డోసులను బయటపెట్టి.. వాటిని పనికి రాకుండా చేశాడు. (చదవండి: కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న నర్స్‌ మృతి)

విషయం తెలుసుకున్న పోలీసులు బ్రాండెన్‌బర్గ్‌ని అరెస్ట్‌ చేశారు. తొలుత అతడు కేవలం 57 వ్యాక్సిన్‌ డోసులను మాత్రమే పనికి రాకుండా చేశాడని భావించినప్పటికి తర్వాత ఆ సంఖ్య 500కు చేరింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు, డిటెక్టివ్‌లు బ్రాండెన్‌బర్గ్‌ అపనమ్మకంతోనే కావాలనే వ్యాక్సిన్‌ డోసులను నాశనం చేశాడని వెల్లడించారు. మరో ముఖ్యమైన అంశం ఎంటంటే బ్రాండెన్‌బర్గ్‌ ఫ్రిజ్‌ నుంచి తీసి బయటపడేసిన వ్యాక్సిన్‌ డోసుల్లో నుంచి 60 డోసులను వైద్యులు ప్రజలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత విషయం తెలియడంతో మిగతా వాటిని వదిలేశారు. (చదవండి: మూఢ నమ్మకాలు.. కరోనా వ్యాక్సిన్‌ వద్దు)

ఇదిలా ఉండగా కరోనాను కట్టడి చేయడానికి మోడర్నా వ్యాక్సిన్‌ హాఫ్‌ డోస్‌ సరిపోతుందా లేదా అనే దాని గురించి తెలుసుకునేందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ మోడర్నా ఇంక్స్‌ శాస్త్రవేత్తలు టెస్ట్‌లు జరుపుతున్నారు. మరో రెండు నెలల్లో ఈ ఫలితాలు వెలువడతాయి. దాన్ని బట్టి వ్యాక్పిన్‌ డోసులను సగానికి తగ్గించాలా లేక రెట్టింపు చేయాలా అనే నిర్ణయం తీసుకోన్నుట్లు తెలిపారు. ఇక అమెరికాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫైజర్‌, మోడర్నా వ్యాక్సిన్‌ల అత్యవసర వినియోగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు