ఫ్రైడ్‌ చికెన్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫ్రై చేసిన టవల్‌

4 Jun, 2021 21:16 IST|Sakshi

ఫిలిప్పీన్స్‌లో చోటు చేసుకున్న సంఘటన

మనీలా: ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అనేది ఈరోజుల్లో చాలా సాధారణ విషయం అయ్యింది. వంట చేసుకునే తీరిక లేని వారు, అసలు వంటే రాని వారు, వేరే ఇతర కారణాలతోనో ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకునేవారు విపరీతంగా పెరిగారు. అయితే అప్పుడప్పుడు మనం ఆర్డర్‌ చేసిన దానికి బదులు వేరే ఐటంలు వచ్చి షాక్‌ ఇస్తాయి. తాజాగా ఫిలిప్పీన్స్‌కు చెందిన ఓ మహిళకు ఇదే అనుభవం ఎదురయ్యింది. ఆన్‌లైన్‌లో ఫ్రైడ్‌ చికెన్‌ ఆర్డర్‌ చేస్తే.. దాని స్థానంలో డీప్‌ ప్రై చేసిన టవల్‌ వచ్చింది. దాన్ని చూసి సదరు మహిళ షాక్‌ అయ్యింది. 

ఆ వివరాలు.. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఆలిక్ పెరెజ్ అనే మహిళ తన కుమారుడి కోసం ఆన్‌లైన్‌లో ఫ్రైడ్ చికెన్ ఆర్డర్ చేసింది. జొల్లిబీ అనే రెస్టారెంట్ నుంచి వచ్చిన ఆర్డర్ తెరిచి ఆతృతగా కత్తితో ఓ ముక్క కత్తిరించాలని ప్రయత్నించింది. చాలా బలంగా ఉండడంతో ఏంటని పూర్తిగా తెరిచి చూసి షాక్‌ అయ్యింది. ఎందుకంటే ఆమె ఫ్రైడ్ చికెన్‌ ఆర్డర్‌ చేస్తే దానికి బదులుగా డీప్‌  ఫ్రై చేసిన టవల్ వచ్చింది. దానితో పాటు నిమ్మకాయ, ఉల్లిపాయాలు కూడా వచ్చాయి.

ఈ సందర్భంగా ఆలిక్‌ మాట్లాడుతూ..  ‘‘అప్పటికే ఆర్డర్ చాలా ఆలస్యమైందనే అసంతృప్తిలో ఉన్నాను. తీరా ఆర్డర్ వచ్చాక తీవ్ర కోపం కలిగింది. మా అబ్బాయి కోసం చికెన్ ఆర్డర్ చేశాను. తనకు ఓ పీస్‌ కట్‌ చేసి ఇద్దామని ప్రయత్నించాను. కానీ కట్‌ అవ్వడం లేదు. దాంతో అనుమానం వచ్చి మా ఆయన్ని పిలిచి దీని సంగతేంటే చూడమన్నాను. ఆయన ప్యాకెట్ మొత్తం తెరిచి చూస్తే బాగా ఫ్రై చేసిన టవల్ కనిపించింది. చాలా ఆశ్చర్యం కలిగింది. తీవ్రమైన కోపం వచ్చింది. ఇలా తరుచూ జరుగుతుంటాయని తెలుసు. కానీ జొల్లిబీ రెస్టారెంట్‌ చేసిన పనికి నాకు చాలా అసహ్యమేసింది. ఇంకో రెస్టారెంట్‌లో చికెన్‌ ఆర్డర్ పెట్టాను. కానీ ఈ టవల్ ప్రభావం ఆ ఫుడ్‌పై కూడా ఉంటుంది’’ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

ఇక ఈ ఘటనపై జొల్లిబీ రెస్టారెంట్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘‘బొనిఫసియో గ్లోబల్ సిటీలోని మా రెస్టారెంట్‌ను మూడు రోజుల పాటు మూసివేస్తున్నాం. జరిగిన దానికి మేము చాలా చింతిస్తున్నాం. దీనిపై దర్యాప్తు కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలా జరగకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం’’ అని పేర్కొంది.

చదవండి: బ్లాక్​ఫంగస్ దానివల్ల రాదు​.. ఇది అసలు విషయం!

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు