శారీరక శ్రమ లేని వారిపై కరోనా ప్రభావం ఎక్కువ

16 Apr, 2021 15:39 IST|Sakshi

యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌డియాగో అధ్యయనం 

బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌

మెడిసిన్‌లో ప్రచురితం

సాక్షి, న్యూఢిల్లీ: శారీరక శ్రమ లేని వారిపై కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉందని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. నిశ్చల స్థితిలో రెండేళ్లుగా ఉన్న వారు కరోనాకు గురైతే బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అమెరికాలో కరోనా మహమ్మారి రాక ముందు రెండేళ్లుగా శారీరక శ్రమ (ఇన్‌ యాక్టివ్‌) లేని వారు ఎక్కువగా ఆసుపత్రి పాలయ్యారని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా శాన్‌డియాగో పరిశోధకులు పేర్కొన్నారు. ఈ తరహా రోగులకు సాధారణంగా ఐసీయూ చికిత్స అందించాల్సి వచ్చిందని, అంతేకాకుండా శారీరక శ్రమ (యాక్టివ్‌) చేసిన వారికన్నా ఈ తరహా రోగులు ఎక్కువగా మృతి చెందారని పేర్కొన్నారు. ఈ అధ్యయనం బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ (బీజేఎస్‌ఎం) తాజా సంచికలో ప్రచురితమైంది. 

వృద్ధాప్యం, అవయవ మార్పిడి చరిత్ర ఉన్న వారి కన్నా గడిచిన రెండేళ్లుగా నిశ్చలంగా ఏ శారీరక శ్రమ లేని వారికే కరోనా అత్యంత ప్రమాదకారిగా తయారైందని పరిశోధకులు చెబుతున్నారు. వృద్ధాప్యం, చికిత్స పొందుతున్నవారు, డయాబెటిక్, ఒబెసిటీ, గుండెపోటు తదితర రోగాలతో బాధపడుతున్న వారు, పురుషులపై కరోనా ప్రభావం అధికంగా కనిపించినట్లు తెలిపారు. జాతి, వయసు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు ఇలా అనేక అంశాలు పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు.

వారంలో 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేసిన వారికన్నా రెండింతలు ఎక్కువగా శారీరక శ్రమ చేయని వారు ఆసుపత్రి పాలయ్యారని తెలిపింది. వీరిలో 73 శాతం ఐసీయూ అవసరం పడింది. మృతి చెందిన వారిలో 2.5 రెట్లు వీరే అధికం. శారీరక శ్రమ లేని రోగులు 20 శాతం అధికంగా ఆసుపత్రుల్లో చేరితే 10 శాతం ఎక్కువ మంది ఐసీయూలో చేరాల్సి వచ్చిందని, 32 శాతం అధికంగా మృతి చెందారని అధ్యయనంలో తేలింది. ఇది ఒక పరిశీలనాత్మక అధ్యయనంగా పరిశోధనలో పాలు పంచుకున్న కైజర్‌ పర్మనెంటీ మెడికల్‌ సెంటర్‌ పరిశోధకులు పేర్కొన్నారు. అన్ని వయసుల వారు తప్పకుండా శారీరక శ్రమ చేయాలని కరోనా నియంత్రణ మార్గదర్శకాల్లో చేర్చాలని పరిశోధకులు సూచించారు.

చదవండి: 

‘కుంభమేళా’పై విమర్శల వెల్లువ 

మరిన్ని వార్తలు