ఇదీ ఆకాశహర్మ్యమే..కానీ మనుషుల కోసం కాదు..

25 Aug, 2022 12:33 IST|Sakshi

పైన చెప్పుకున్నట్లు ఇదీ ఆకాశహర్మ్యమే.. ఉన్నది కూడా చైనాలోనే.. అయితే.. మన కోసం కాదు.. స్టార్‌ హోటల్‌ను తలపిస్తున్న ఈ 26 అంతస్తుల భవనాన్ని పందుల కోసం నిర్మిస్తున్నారు. షాక్‌ అవ్వాల్సిన పని లేదు. నిజమే.. పందుల పెంపకం కోసం ఇంత పెద్ద భవనం నిర్మించడం ప్రపంచంలోనే మొదటిసారి. చైనాలో ప్రధాన ఆహారమైన పోర్క్‌ ఉత్పత్తిని పెంచడానికి, తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడానికి ఇలాంటి భవనాల్లో పందులను పెంచుతున్నారు.

ఆఫ్రికాలో స్వైన్‌ఫ్లూ తరువాత.. వాణిజ్యపరమైన ఎగుమతుల కోసం పందుల పెంపకంపై దృష్టిపెట్టిన చైనా, ఇలా బహుళ అంతస్తుల భవనాల్లో ఫార్మింగ్‌కు అనుమతించింది. మొదట రెండు మూడు అంతస్తులతో మొదలైన ఈ ఫార్మింగ్‌ ఇప్పుడిలా 26 అంతస్తులకు చేరింది. అక్కడి పందులకు యంత్రాలే ఆహారాన్ని సరఫరాచేస్తాయి.

గాలి శుద్ధీకరణ, ఇన్ఫెక్షన్స్‌ సోకకుండా పద్ధతులు, పందుల వ్యర్థాలతో బయోగ్యాస్‌ ప్లాంట్, దాన్నుంచే విద్యుత్‌ ఉత్పత్తి ఇలా అధునాతన పద్ధతులను అవలంబిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం ప్రారంభమైతే నెలకు 54వేల టన్నులు, ఏడాదికి 60 లక్షల టన్నులు పోర్క్‌ ఉత్పత్తి చేయనుంది. గతంలో యూరప్‌లోనూ ఇలాంటి నిర్మాణాలున్నా.. వివిధ కారణాలతో చాలా మూతపడ్డాయి. ఉన్న ఒకటి అరా మూడంతస్తులకు మించలేదు.
చదవండి: మీ కోసం తెచ్చిన కేక్‌ పక్కోడు కట్‌ చేస్తే?.. అచ్చం ఇలాగే ఉంటుంది కదూ!

>
మరిన్ని వార్తలు