Pigcasso Artwork: కుంచె పట్టి రంగుల చిత్రాలు గీస్తున్న పంది!

28 Dec, 2021 15:38 IST|Sakshi
పిగ్‌కాసో వేసిన చిత్రం

Pig Painter Pigcasso’s Artwork Story In Telugu రవివర్మ, లియోనార్డో డావిన్సీ, మైకెలాంజిలో, ఆర్టెమిసియా జెంటిలేస్చి... వంటి ప్రసిద్ధ పెయింటర్స్‌ చేతుల్లో జీవం పోసుకున్న రకరకాల పెయింటింగ్‌లను మీరిప్పటివరకూ చూసి ఉంటారు. అఫ్‌కోర్స్‌! వాటి ధర కూడా కోట్ల రూపాయలు పలుకుతాయి. ఐతే మీమ్మల్ని అమితాశ్చర్యాలకు గురచేసే ఈ సరి కొత్త పెయింటర్‌ గురించి ఇప్పటివరకూ తెలిసుండదు. ఆ పెయింటర్‌ మనిషికాదు ఓ జంతువు. అది వేసే రంగుల చిత్రాలకు జనాల్లో యమ క్రేజీ ఉంది. ఒక పెయింట్‌ ధర లక్షల రూపాయలు పలుకుతోంది మరి! ఆ జంతువు మరేదోకాదు అక్షరాలా ఓ పంది. ఇక ఈ సునక పెయింటర్‌ కుంచెతో పట్టి గీసిన చిత్రాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం..

ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఈ పంది పేరు పిగ్‌కాసో. పిగ్‌కాసో తాజాగా వేసిన పెయింటింగ్‌ 72 గంటల్లోనే డిసెంబర్‌ 13న జర్మనీకి చెందిన వ్యక్తి 20 వేల డాలర్లు (రూ. 14, 97, 000) కు కొన్నట్లు అక్కడి స్థానిక మీడియా తెల్పింది. గతంలో ఓ చింపాజీ వేసిన పెటింటింగ్‌ 14 వేల డాలర్లు పలకగా, తాజాగా ఆ రికార్డును పిగ్‌కాసో బద్ధలుకొట్టింది.

నిజానికి దక్షిణాఫ్రికాలోని ఫ్రెంచ్‌వ్యాలీకి చెందిన జోన్ లెఫ్సన్, 2016లో కేప్ టౌన్‌లోని పదిమాంసం విక్రయించే దుకాణం నుంచి ఈ పందిని కాపాడింది. ఆతర్వాత ఆమె తనతో పాటు పందిని తీసుకువచ్చి పెంచుకోవడం ప్రారంభించింది. ఐతే ఒక రోజు అనుకోకుండా కొన్ని పెయింట్ బ్రష్‌లను పిగ్‌కాసో ఉంటున్న ఎన్‌క్లోజర్‌లో జోన్ వదిలేసింది. బ్రష్‌లతో ఆడుతున్న పందిని చూసిన జోన్‌కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఇంకేముంది అప్పటినుంచి ఎన్నో అద్భుతమైన పెయింటింగ్స్ వేయడం ప్రారంభించింది పిగ్‌కాసో.

5 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 400కుపైగా పెయింటింగ్స్ వేసింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ పంది వేసిన పెయింటింగ్స్‌ ప్రజలు ఎంతగానో ఇష్టపడతారట. హాట్‌ కేకుల్లా వేసీవేయంగానే లక్షల్లో అమ్ముడుపోతున్నాయని, ఈ విధంగా పెయింటింగ్స్‌ ద్వారా వచ్చిన డబ్బును ఇతర జంతువుల పెంపకానికి వినియోగిస్తున్నట్లు జోన్ లెఫ్సన్ మీడియాకు తెల్పింది. యానిమల్‌ ఆర్ట్‌కు జనాల్లో బాగానే పాపులార్టీ ఉంది కదా!

చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు..

మరిన్ని వార్తలు