ఘోర బస్సు ప్రమాదం.. 20 మంది హజ్‌ యాత్రికులు దుర్మరణం

28 Mar, 2023 10:46 IST|Sakshi

సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హజ్‌ యాత్రికులతో వెళుతున్న బస్సు సోమవారం అదుపుతప్పి వంతెనను ఢీట్టింది. దీంతో బస్సు బోల్తా పడి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 20 మంది ప్రయాణికులు మరణించారు. మరో 29 మంది తీవ్రంగా గాయపడినట్లు సౌదీ ప్రభుత్వ మీడియా తెలిపింది.  ఖమీస్ ముషైత్ నుంచి అభాకు వెళ్తుండగా అసిర్ ప్రావిన్స్‌లోని అకాబత్ షార్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న అధికారులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బ్రేక్ ఫెయిల్యూర్ కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ‘బస్సు ప్రమాదంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20కు చేరింది.  మరో 29 మంది గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం’ అని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

కాగా బస్సులో ప్రయాణిస్తున్న బాధితులందరూ వివిధ దేశాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం కావడంతో వాళ్లంతా  మక్కా, మదినా యాత్ర కోసం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. 2019 అక్టోబర్‌లోనూ మదీనా సమీపంలో బస్సు మరొక భారీ వాహనాన్ని ఢీకొనడంతో 35 మంది విదేశీయులు మరణించారు.
చదవండి: ఇదోక జబ్బులా ఉంది! స్కూల్‌లో కాల్పులు ఘటనపై జోబైడెన్‌ ఫైర్‌

మరిన్ని వార్తలు