Pizza Delivery Driver Saves Family: డెలివరీ బాయ్‌ కాదు హీరో.. ప్రాణాలకు తెగించి మంటల్లో చిక్కుకున్న ఫ్యామిలీని బయటకు

18 Jul, 2022 15:38 IST|Sakshi

వాషింగ్టన్‌: అర్ధరాత్రి మంటల్లో కాలిపోతున్న ఇంట్లోకి ప్రాణాలకు తెగించి వెళ్లాడు ఓ పిజ్జా డెలివరీ బాయ్. అందులో చిక్కుకున్న ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ఈ క్రమంలో అద్దాలు పగలగొట్టి మరీ మొదటి అంతస్తు నుంచి దూకి చేతికి గాయం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.  ఈ యువకుడు చేసిన సాహసాన్ని పోలీసులు సహా స్థానికులు కొనియాడారు. పిజ్జా డెలివరీ బాయ్ హీరో అని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అమెరికా లఫయెట్టెలో ఈ ఘటన గతవారం జరిగింది.

హీరోగా పేరు తెచ్చుకున్న ఈ యువకుడి పేరు నికోలస్‌ బోస్టిక్. వయసు 25 ఏళ్లు. పిజ్జాలు డెలివరీ చేసి అర్ధరాత్రి ఇంటికి తిరిగివెళ్తున్నప్పుడు  ఓ ఇంట్లో నుంచి మంటలు రావడం గమనించాడు. వెంటనే పెద్దగా అరుస్తూ ఆ ఇంటి బ్యాక్ డోర్‌ నుంచి లోపలికి వెళ్లాడు. ఇతని అరుపులు విని ఇంట్లో మొదటి అంతస్తులో  నిద్రపోతున్న నలుగురు పిల్లలు లేచారు.

బోస్టిక్ వాళ్ల దగ్గరకు వెళ్లి కిందకు తీసుకొస్తుండగా.. మరో ఆరేళ్ల చిన్నారి లోపలే ఉన్నట్లు వాళ్లు చెప్పారు. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా బోస్టిక్ మంటల్లోనే గదిలోపలికి వెళ్లాడు. అయితే ఆ పిల్లాడు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏడుస్తూ కన్పించాడు. దీంతో కిటికీ అద్దాలను చేతితోనే పగలగొట్టి కిందకు దూకాడు బోస్టిక్. ఆరేళ్ల చిన్నారి సహా మొత్తం ఐదుగురిని సురక్షితంగా కాపాడాడు. ప్రాణాలతో బయటపడ్డవారిలో 18 ఏళ్లు, 13 ఏళ్లు, ఏడాది వయసున్న చిన్నారి కూడా ఉన్నారు.

బోస్టిక్ సహసాన్ని పోలీసులు కొనియాడారు. అతను నిస్వార్థంగా ఆలోచించి ఐదుగురి ప్రాణాలను కాపాడాడని ప్రశంసించారు. అతను రియల్ హీరో అని పొగడ్తలతో ముంచెత్తారు. పోలీసు శాఖ తరఫున అతనికి కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోనూ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

చదవండి: రన్‌ వేపై దిగుతూ మరో విమానాన్ని ఢీకొట్టిన ఫ్లైట్‌.. నలుగురు మృతి

>
మరిన్ని వార్తలు