ఏమిటీ ప్లానెట్‌ కిల్లర్‌? భూమి వైపుగా దూసుకొస్తున్న ఉపద్రవం .. ఢీ కొట్టడం ఖాయం!

1 Nov, 2022 17:25 IST|Sakshi

భూమి వైపుగా దూసుకొచ్చే గ్రహశకలాలను.. అంతరిక్షంలో ఉండగానే స్పేస్‌ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీ కొట్టించడం.. తద్వారా కుదిరితే కక్ష్య వేగం తగ్గించి దారిమళ్లించడం.. లేదంటే పూర్తిగా నాశనం చేయడం.. అమెరికా స్పేస్‌ రీసెర్చ్‌ సెంటర్‌ నాసాకు ఇప్పుడు లక్ష్యాలుగా మారాయి. ఈ క్రమంలో.. డార్ట్‌(డబుల్‌ ఆస్టారాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌) మిషన్‌ తెర మీదకు వచ్చింది కూడా. అయితే డార్ట్‌ మిషన్‌కు కూడా అంతుచిక్కకుండా ఓ గ్రహ శకలం.. భూమి వైపుగా దూసుకొస్తే ఎలా ఉంటుంది?..

ఈమధ్య.. ఓ నెల కిందట నాసా అంతరిక్ష లోతుల్లో ఓ ఆస్టరాయిడ్‌ను స్పేస్‌ క్రాఫ్ట్‌తో ఢీ కొట్టించడం ద్వారా విజయవంతంగా దారి మళ్లించింది. ఈలోపే మరో పిడుగు లాంటి వార్తను వెల్లడించింది నాసా.  భూమికి అత్యంత సమీపంగా వచ్చే అవకాశం ఉన్న మరో మూడు గ్రహశకలాలను గుర్తించిందట. అంతేకాదు.. సౌరవ్యవస్థ లోపలే అవి దాక్కుని ఉన్నాయని, వాటి గమనాన్ని అంచనా వేయడం చాలా కష్టతరంగా మారిందని నాసా ప్రకటించింది.

ఈ మేరకు చిలీలోని సెర్రో టోలోలో ఇంటర్‌ అమెరికన్‌ అబ్జర్వేటరీ వద్ద టెలిస్కోప్‌కు అమర్చిన డార్క్‌ ఎనర్జీ కెమెరా ద్వారా ఈ మూడు గ్రహశకలాలను గుర్తించగలిగింది నాసా బృందం. మూడు గ్రహశకలాల్లో రెండు.. కిలోమీటర్‌ వెడల్పుతో ఉన్నాయి. మూడవది మాత్రం ఒకటిన్నర కిలోమీటర్‌ వెడల్పుతో ఉండి.. భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా స్పష్టం చేసింది. అయితే.. 

సౌర వ్యవస్థ లోపలి భాగంలో అదీ భూమి, శుక్ర గ్రహం అర్బిట్‌ల మధ్య ఈ మూడు గ్రహ శకలాలు గుర్తించామని, సూర్య కాంతి కారణంగా వీటి గమనాన్ని గుర్తించడం కష్టతరంగా మారిందని నాసా బృందం తెలిపింది. వీటిని 2022 AP7, 2021 LJ4, 2021 PH27గా వ్యవహరిస్తున్నారు.

ఇందులో 2022 ఏపీ7 ఒకటిన్నర కిలోమీటర్‌ వెడల్పుతో కిల్లర్‌ ప్లానెట్‌గా గుర్తింపు దక్కించుకుంది. సాధారణంగా కిలోమీటర్‌ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న ఆస్టరాయిడ్స్‌ను కిల్లర్‌ ప్లానెట్‌గానే వ్యవహరిస్తుంటారు. ఎందుకంటే ఇవి చేసే డ్యామేజ్‌ ఎక్కువ. అందుకే ఆ పేరు వచ్చింది. అయితే.. గత ఎనిమిదేళ్లలో ఇంత ప్రమాదరకమైన గ్రహశకలాన్ని గుర్తించడం మళ్లీ ఇదే. 

ఇది ఏదో ఒకరోజు ఇది కచ్చితంగా భూ కక్ష్యలోకి అడుగుపెడుతుందని.. భూమిని కచ్చితంగా  ఢీకొట్టి తీరుతుందని అంచనా వేస్తున్నారు నాసా సైంటిస్టులు. మిగతా 2021 ఎల్‌జే4, 2021 పీహెచ్‌27 మాత్రం భూమార్గానికి దూరంగానే వెళ్లనున్నాయి. అయితే ప్రమాదకరమైన ఆ గ్రహశకలాన్ని దారి మళ్లించడం, నాశనం చేయడం గురించి ఇప్పుడే ఎలాంటి ప్రకటన చేయడం కుదరదని నాసా స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి: లాటరీలో ఏకంగా రూ. 248 కోట్లు, కానీ..

మరిన్ని వార్తలు