శ్రీలంక: అప్పుల ఊబి నుంచి గట్టెక్కేందుకు.. నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేయాలని నిర్ణయం

17 May, 2022 15:38 IST|Sakshi

కొలంబో: శ్రీ లంక ప్రభుత్వం నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో నష్టాలను భరించేందుకు.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఈ నిర్ణయం తప్పదని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే స్పష్టం చేశారు. 

సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన లంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే.. పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో లంక దారుణమైన పరిస్థితిని ఎదుర్కోనుందని, ప్రజలను అబద్ధాలతో మభ్య పెట్టడం ఇష్టం లేక నిజాలు చెప్తున్నానంటూ ఖుల్లా  ప్రకటనతో దేశ పరిస్థితి చెప్పేశారు ఆయన. ఈ క్రమంలో.. ప్రభుత్వ విమాన సంస్థను అమ్మేయాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు.

మార్చి 2021 చివరినాటికే విమానయాన సంస్థ.. 45 బిలియన్‌ రూపీస్‌ (124 మిలియన్‌ డాలర్లు) నష్టాల్లో ఉందని తెలిపారు. విమానంలో ఏనాడూ అడుగు పెట్టని నిరుపేదలు ఈ నష్టాన్ని భరించాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు.. అంటూ ప్రైవేటీకరణ దిశగా సంకేతాలు ఇచ్చారాయన. 1975లో ఏర్పాటైన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లోని 126 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 2006 తర్వాత తొలిసారి ఓ త్రైమాసికంలో లాభాలు వచ్చాయని గత నెలలో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించుకుంది కూడా.

ఇదిలా ఉండగా.. విక్రమ్‌సింఘే శ్రీలంక ప్రధాని పదవి చేపట్టి వారం కూడా కాలేదు. కానీ, ఆయన ముందు పెను సవాల్లే ఉన్నాయి. సంక్షోభం నడుమే ప్రధాని పగ్గాలు అందుకున్న ఆయన.. వచ్చి రావడంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కరెన్సీ ముద్రణ లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కూడా. 

డాలర్ల కొరత వేధిస్తున్న తరుణంలో.. రాబోయే ఒకటి రెండు రోజుల్లో 75 మిలియన్‌ డాలర్ల విదేశీ కరెన్సీ అవసరమని, ఇంధనాల మీద ప్రభుత్వం ఇక సబ్సిడీ భరించే స్తోమత లేదని, రాబోయే రోజుల్లో ధరల మోత తప్పదంటూ సంచలన ప్రకటనలు చేశాడు కూడా.

చదవండి: ముందు ముందు మరింత ఘోరం.. చేతులెత్తేసిన శ్రీలంక కొత్త ప్రధాని!

మరిన్ని వార్తలు