First City on Mars: అంగారక నగరం.. నువా!

28 Mar, 2021 08:22 IST|Sakshi
చిత్రం: అబిబో ఆర్కిటెక్చర్‌

ఇంకో వందేళ్లకైనా సరే.. జనాభాతో కిక్కిరిసిపోయి.. వనరులు తగ్గిపోయిన భూమిని వదిలేసి ఇంకో గ్రహానికి వెళ్లకతప్పదని చాలాకాలంగా శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. అలాంటి ఆలోచనల ప్రతిరూపమే ఈ ‘నువా’! అంగారక గ్రహంపై ఎప్పుడైనా ఓ నగరాన్ని నిర్మిస్తే.. ఇలా కడితే బాగుంటుందని అబిబో అనే ఓ ఆర్కిటెక్చర్‌ సంస్థ సిద్ధం చేసిన ప్రణాళిక ఇది. టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌ మస్క్‌ 2050 నాటికి అరుణగ్రహంపై మనుషులతో ఓ కాలనీ కట్టేస్తానని ప్రకటించిన నేపథ్యంలో.. అబిబో ప్రతిపాదిస్తున్న ఈ డిజైన్‌కు ప్రాధాన్యం ఏర్పడింది. చైనా దేవతల్లో ఒకరైన ‘నువా’పేరుతో సిద్ధం చేసిన ఈ అంగారక నగరం విశేషాలేమిటో చూద్దామా..

  • అంగారకుడిపై థార్సిస్‌ ప్రాంతంలో టెంపే మెన్సా శిఖరానికి ఒకవైపున గుహల్లాంటి నిర్మాణాలతో ఉండే నువాలో మొత్తం 2.5 లక్షల మంది వరకు నివసించొచ్చు. ఒక్కో ఇల్లు 25 నుంచి 35 చదరపు మీటర్ల (270–380 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ నగర పరిపాలన వ్యవస్థ చెప్పే పనులు చేస్తూండాలి. పనివేళల్లో 60– 80 శాతం సమయాన్ని ఇందుకు కేటాయించాల్సి ఉంటుంది.

  • అరుణగ్రహంపై వెలువడే రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు నువాలో ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. టెంపే మెన్సా ప్రాంతాన్ని ఎంచుకోవడం కూడా ఇందుకే. శిఖరానికి ఒకవైపు తక్కువ రేడియో ధార్మికత ఉంటుంది. బతికేందుకు అవసరమైన ఆహారం, నీరు, గాలి వంటివన్నీ అక్కడికక్కడే తయారుచేసుకోవాల్సి ఉంటుంది. గులెం అంగ్లాడా అనే శాస్త్రవేత్త నేతృత్వంలో ఎస్‌ఓఎన్‌  నెట్‌వర్క్‌ నువాలో వ్యవసాయానికి సంబంధించిన అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు.

  • శిఖరం దిగువ భాగంలో నువాలో నివసించే వారు ఒకరిని ఒకరు కలుసుకునేందుకు తగిన ఏర్పాట్లు ఉంటాయి. పారదర్శకమైన పదార్థంతో తయారైన గోడల కారణంగా అంగారకుడి అందాలను నేరుగా వీక్షించొచ్చు. ఇళ్ల కోసం గుహలను తొలిచే క్రమంలో మిగిలే వ్యర్థాలను రేడియో ధార్మికత నుంచి రక్షణ కల్పించేందుకు ఉపయోగిస్తారు.

  • ఆసుపత్రి, పాఠశాలలు, క్రీడా స్థలాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్‌కు తగిన ఏర్పాట్లు ఉంటాయి. భూమిపై నుంచి అరుణగ్రహానికి.. అక్కడి నుంచి మళ్లీ భూమికి వచ్చేందుకు అవసరమయ్యే స్పేస్‌ స్టేషన్‌, స్థానికంగా అటు ఇటూ వెళ్లేందుకు ఒక రైల్వే స్టేషన్‌ కూడా ఉంటుంది.
  • అంతా బాగుంది కానీ ఎప్పుడు కడతారు దీన్ని? అయితే ఈ ప్రశ్నకు ఇప్పటికైతే అబిబో స్పష్టమైన సమాధానం ఇవ్వట్లేదు. కాకపోతే ఎలన్‌  మస్క్‌ లాంటి వారు అరుణగ్రహంపైకి మనుషులను పంపగానే నిర్మాణమూ మొదలు కావొచ్చని అంచనా.

– సాక్షి, హైదరాబాద్‌

చదవండి: మార్స్ సంచలన నిజాలు బయటపెట్టిన నాసా...!

మరిన్ని వార్తలు