నేపాల్‌ ప్రధాని ఓలి బహిష్కరణ

25 Jan, 2021 06:35 IST|Sakshi

కఠ్మాండూ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలిని నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాజీ ప్రధాని ప్రచండ(పుష్ప కమల్‌ దహల్‌) నేతృత్వంలోని ప్రత్యర్థి వర్గం ఆదివారం నిర్ణయించింది. తాజా నిర్ణయంతో, పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. ఓలిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తూ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పార్టీ సీనియర్‌ నేత గణేశ్‌ షా వెల్లడించారు.

ఓలిని పార్టీ సహ అధ్యక్ష పదవి నుంచి కూడా డిసెంబర్‌ నెలలో తొలగిం చిన విషయం తెలిసిందే. ప్రచండతో పాటు, ఆయనకు సన్నిహితుడైన మాధవ్‌ నేపాల్‌ను ఆ స్థానంలో నియమించారు. ప్రచండ వర్గం ఆధిపత్యం ఉన్న స్టాండింగ్‌ కమిటీ జనవరి 15న  పార్టీ వ్యతిరేక కార్యకలాపాల విషయంపై ఓలిని వివరణ కోరింది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాకపోవడంతో తాజా నిర్ణయం తీసుకున్నామని గణేశ్‌ షా తెలిపారు.   

మరిన్ని వార్తలు