చైనా అధ్యక్షుడికి చిరునవ్వుతో షేక్‌ హ్యండ్‌ ఇచ్చిన ప్రధాని మోదీ.. ఇదే తొలిసారి!

15 Nov, 2022 20:21 IST|Sakshi

బాలీ: భారత ప్రధాని నరేంద​ మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిశారు. ఈ దృశ్యాలు ఇండోనేషియాలోని బాలి వేదికగా జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సదస్సులో ఆవిష్కృతమయ్యాయి. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఈ ఇద్దరు నేతలు యాదృచ్ఛికంగా కలుసుకున్నారు. జిన్‌పింగ్‌ ఎదురుపడగానే మోదీ చిరునవ్వుతో షేక్‌ హ్యండ్‌ ఇచ్చారు. ఇద్దరు కొద్దిసేపు నవ్వుతూ మాట్లాడుతున్నారు. 

అయితే తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా మధ్య ఘర్షణలు అనంతరం ఇలా ఇరు దేశాల నాయకులు కరచాలనం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతకుముందు సెప్టెంబర్‌లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన షాంఘై సహాకార సంస్థ(ఎస్‌సీఓ) వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ఇద్దరు నేతలు ఎదురుపడినప్పటికీ కనీసం పలకరించుకోలేదు.

కాగా ఇండోనేసియాలోని బాలి వేదికగా ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు నేడు(నవంబర్‌ 15) ప్రారంభమైంది. రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ సమావేశాల్లో జీ20 సభ్య దేశాలన్నీ పాల్గొన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌, ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌, జర్మన్‌ ఛాన్స్‌లర్‌ ఓలఫ్‌ షోల్జ్‌లతోపాటు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రపంచంలో శక్తిమంతమైన కూటమిగా పేరుగాంచిన జీ20 నిర్వహణ బాధ్యతలను డిసెంబర్‌ 1న ఇండోనేషియా నుంచి భారత్‌ స్వీకరించనుంది. 
చదవండి: ప్చ్‌! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు

మరిన్ని వార్తలు