పర్యావరణానికి ‘లైఫ్‌’

21 Oct, 2022 06:29 IST|Sakshi
‘మిషన్‌ లైఫ్‌’ కార్యక్రమంలో మోదీ, గుటెరస్‌

భారత్‌ ఆధ్వర్యంలో కొత్త కార్యాచరణ

మిషన్‌ లైఫ్‌ను ప్రారంభించిన మోదీ, యూఎన్‌ ప్రధాన కార్యదర్శి గుటెరస్‌

కెవాడియా: వాతావరణ మార్పుల కారణంగా విధ్వంసకరమైన పరిణామాల నుంచి మన భూమండలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా భారత్‌ ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ కార్యాచరణ రూపు దిద్దుకుంది.  ప్రధాని మోదీ, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్‌ సంయుక్తంగా మిషన్‌ లైఫ్‌(లైఫ్‌ స్టైల్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌)ను  ప్రారంభించారు. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకోవడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దీనిని ప్రపంచ దేశాల ప్రజల్లోకి ఒక ఉద్యమంలా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర గురువారం లైఫ్‌ మిషన్‌ను ప్రారంభించారు. ప్రజలు లైఫ్‌ స్టైల్‌లో మార్చుకోవాల్సిన జాబితాతో పాటు లైఫ్‌ లోగోను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ మిషన్‌ పీ3 మోడల్‌ అని ప్రో ప్లేనెట్, పీపుల్‌గా వ్యాఖ్యానించారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్‌’ విధానాన్ని అందరూ అనుసరించాలని ప్రధాని పిలుపునిచ్చారు.   

ప్రజలు చేయాల్సిందిదే..!
ప్రతీ రోజూ ఒక వ్యక్తి జిమ్‌కి వెళ్లడానికి పెట్రోల్‌తో నడిచే బైక్, కారు వంటి వాహనాన్ని వాడే బదులుగా సైకిల్‌పై వెళ్లడం మంచిదన్నారు. ఎల్‌ఈడీ బల్బులు వాడితే విద్యుత్‌ బిల్లులు తగ్గడమే కాకుండా పర్యావరణానికి మేలు జరుగుతుందని ప్రధాని హితవు పలికారు. ఇలాంటివన్నీ ప్రజలందరూ మూకుమ్మడిగా పాటిస్తే ప్రపంచ దేశ ప్రజలందరి మధ్య ఐక్యత పెరుగుతుందని మోదీ చెప్పారు.  

ప్రకృతి వనరుల్ని అతిగా వాడొద్దు : గుటెరస్‌  
ప్రకృతి వనరుల్ని అతిగా వినియోగించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతోందని గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. జీ–20 దేశాలు 80 శాతం గ్రీన్‌ హౌస్‌ వాయువుల్ని విడుదల చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చెప్పిన మాటల్ని గుటెరస్‌ గుర్తు చేసుకున్నారు. ‘‘ప్రతీ ఒక్కరి అవసరాలు తీర్చే వనరులు ఈ భూమిపై ఉన్నాయి. కానీ అందరి అత్యాశలను నెరవేర్చే శక్తి భూమికి లేదు. దురదృష్టవశాత్తూ ఇవాళ రేపు ప్రతీ ఒక్కరూ అత్యాశకి పోతున్నారు. దానిని మనం మార్చాలి’’ అని కొన్ని దశాబ్దాల కిందటే గాంధీజీ  చెప్పారని ఇప్పటికీ అది అనుసరణీయమని వ్యాఖ్యానించారు. భారత్‌ తీసుకువచ్చిన ఈ కార్యాచరణని ప్రపంచ దేశాలు ప్రశంసిస్తున్నాయి.

మరిన్ని వార్తలు