మాక్రాన్‌తో మోదీ భేటీ

6 May, 2022 06:09 IST|Sakshi

పారిస్‌: ప్రస్తుత ప్రపంచ పరిణామాలు, ఇండో–ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక సంబంధాలపై ఫ్రెంచ్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మాక్రాన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ విస్తృత చర్చలు జరిపారు. ప్రపంచశాంతి కోసం ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ప్రణాళికలపై ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. డెన్మార్క్‌ పర్యటన అనంతరం మోదీ ఫ్రాన్స్‌ స్వల్పకాలిక పర్యటనకు వచ్చారు. పారిస్‌లోని ఎలైసీ పాలస్‌లో మాక్రాన్‌తో విస్తృత చర్చలు జరిపారని విదేశాంగ శాఖ తెలిపింది.

మాక్రాన్‌ను కలవడం సంతోషాన్నిచ్చిందని, ఇండియా, ఫ్రాన్స్‌లు పలు రంగాల్లో కీలక భాగస్వాములని మోదీ ట్వీట్‌ చేశారు. వివిధ అంతర్జాతీయ సంక్షోభాలు, ఇరుదేశాల మధ్య భాగస్వామ్యం, భారత్‌ కీలక పాత్ర పోషించే ఎఫ్‌ఏఆర్‌ఎం కార్యక్రమంపై మోదీతో చర్చించానని మాక్రాన్‌ ట్వీట్‌ చేశారు. వీలైనంత త్వరలో భారత పర్యటనకు రావాలని మాక్రాన్‌ను మోదీ ఆహ్వానించారు.

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో శాంతిస్థాపనకు రెండుదేశాలు కీలక భాగస్వామ్యం కొనసాగిస్తున్నాయని, ఈ ప్రాంతం స్వేచ్ఛగా ఉండాలన్నది ఇరుదేశాల ఆకాంక్షని ఉమ్మడి ప్రకటన తెలిపింది. పరోక్షంగా ఈ ప్రాంతంపై చైనా పెత్తనాన్ని ప్రస్తావించింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న సంక్షోభంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధంలో పౌర మరణాలను ఇరువురూ ఖండించారు. వెంటనే ఇరుపక్షాలు కాల్పుల విరమణ పాటించాలని, చర్చలు ఆరంభించాలని విజ్ఞప్తి చేశారు. ఐరాస నిబంధనలను అందరూ గౌరవించాలని  కోరారు.

శీతోష్ణస్థితి మార్పుపై ఉమ్మడి పోరాటం
 శీతోష్ణస్థితి మార్పును గతంలో కన్నా బలంగా ఎదుర్కోవాలని ఇండియా, ఫ్రాన్స్‌ నిర్ణయించాయి. పర్యావరణహిత సాంకేతికతలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై  మాక్రాన్, మోదీ చర్చలు జరిపారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ) లక్ష్యాలకు తమ మద్దతు ప్రకటించారు. జాతీయ హైడ్రోజన్‌ మిషన్‌లో పాలుపంచుకోమని ఫ్రాన్స్‌ను భారత్‌ ఆహ్వానించింది.

>
మరిన్ని వార్తలు