ఫ్రాన్స్‌ అధ్యక్షుడు, సింగపూర్‌ ప్రధానితో మోదీ భేటీ

31 Oct, 2021 04:58 IST|Sakshi
మాక్రాన్‌తో మోదీ..

జి–20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోమ్‌లో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత్‌–ఫ్రాన్స్‌ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్, జాతీయ భదత్రా సలహాదారు అజిత్‌ దోవల్‌ ఉన్నారు. మోదీ, మాక్రాన్‌ నడుమ ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్వీట్‌ చేసింది.

ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువరూ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడనున్నాయని పేర్కొంది. నరేంద్ర మోదీ రోమ్‌లో సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌తోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సమీక్షించారు. లూంగ్‌తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్విట్టర్‌లో వెల్లడించింది.  

భారత సంతతి ప్రజలతో సమావేశం
ఇటలీలోని పలువురు భారత సంతతి ప్రజలు, భారతీయులను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ మేరకు ఫొటోలను మోదీ ట్విట్టర్‌లో పంచుకున్నారు.

మరిన్ని వార్తలు