Narendra Modi In UNO ఐరాసలో పాక్‌కు ప్రధాని హెచ్చరిక

26 Sep, 2021 03:18 IST|Sakshi

ఐరాస వేదికగా పాక్‌కు భారత ప్రధాని మోదీ హెచ్చరిక

న్యూయార్క్‌: ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు పాముకు పాలు పోస్తున్నామని అర్ధం చేసుకోవాలని, ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా వాడే దేశాలు చివరకు అది తమను కూడా కబళిస్తుందని గ్రహించాలని ప్రధాని నరేంద్ర మోదీ దాయాది దేశానికి ఐక్యరాజ్యసమితి వేదికగా చురకలంటించారు. ఐరాస 76వ సమావేశంలో ప్రధాని మోదీ శనివారం పస్రంగించారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్‌ స్వర్గధామంగా మారుతోందని పొరుగుదేశాలు గగ్గోలు పెడుతున్న సందర్భంగా ఐరాస వేదికగా ప్రధాని గట్టి హెచ్చరిక చేశారు.

అఫ్గాన్, కరోనా, ఇండోపసిఫిక్, అంతర్జాతీయ సవాళ్లు.. వంటి అనేక అంశాలను ప్రధాని తన సందేశంలో ప్రస్తావించారు.  ప్రస్తుతం ప్రపంచం తిరోగామి ఆలోచనా విధానాలు, అతివాద విధానాలతో సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచమంతా శాస్త్రీయాధారిత ధృక్పధాన్ని, పురోగామి మార్గాన్ని అవలంబించి అభివృద్ధి దిశగా పయనించాలని అభిలíÙంచారు. శాస్త్రీయ ధోరణులను పెంపొందించేందుకు భారత్‌ అనుభవాధారిత విద్యను ప్రోత్సహిస్తోందని చెప్పారు.

ఇదే సమయంలో కొన్ని దేశాలు మాత్రం తీవ్రవాదాన్ని స్వీయప్రయోజనాలకు అనుకూలంగా వాడుకోవాలని తిరోగామి ఆలోచనలు చేస్తున్నాయని పరోక్షంగా పాక్‌పై మండిపడ్డారు.  వివిధ అంతర్జాతీయ సంస్థలు చైనా విషయంలో మాటమార్చడాన్ని ప్రస్తావించారు. ఐరాస విశ్వనీయత పెంచుకోవాలని చురకలంటించారు. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో చైనా చర్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ సముద్రాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదన్నారు. అఫ్గానిస్తాన్‌ను ఎవరూ సొంత ప్రయోజనాలకు వాడుకోకూడదని హితవు చెప్పారు.  

ఇంకా ప్రధాని ఏమన్నారంటే...
ప్రజాస్వామ్యం: ఒక టీ అమ్ముకునే వ్యక్తి స్థాయి నుంచి ఐరాసలో భారత ప్రధానిగా ప్రసంగించేవరకు సాగిన నా జీవితం భారతీయ ప్రజాస్వామిక బలానికి నిదర్శనం. ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లివంటిది. ఈ ఏడాది ఆగస్టు 15న ఇండియా 75వ స్వాతంత్య్రోత్సవాలు జరుపుకుంది. భారత్‌లో భిన్నత్వమే బలమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం. వివిధ ప్రభుత్వాల అధినేతగా త్వరలో నేను 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాను. భారత్‌లో ప్రజాస్వామ్యం విజయవంతమైందనేందుకు నేనే నిదర్శనం.  

ఐరాస: ఐక్యరాజ్యసమితి సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. వివిధ దేశాలకు ఆలంబనగా ఉండాలనుకుంటే ఐరాస విశ్వసనీయతను పెంచాలి. సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకుంటే విఫలమైనట్లేనన్న చాణక్య సూక్తిని గుర్తు చేసుకోవాలి. కరోనా, వాతావరణ మార్పు తదితర అంశాల్లో ఐరాస ప్రవర్తన గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి. అఫ్గాన్‌ ఉదంతం ఐరాస తీరుపై ప్రశ్నల్లో వాడిని పెంచాయి. కరోనా పుట్టుక, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాకింగులు, అంతర్జాతీయ సంస్థల పనితీరు వంటివి అనేక సంవత్సరాల ఐరాస కృషిని, ఐరాసపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఐరాసను అందరం బలోపేతం చేయాలి. అప్పుడే అంతర్జాతీయ చట్టాలు, విలువలకు రక్షణ లభిస్తుంది.  

కరోనా– టీకా: మహ్మమారిపై పోరు ప్రపంచప్రజలకు ఐకమత్యం విలువను తెలియజేసింది. రెండేళ్లుగా ప్రపంచ మానవాళి జీవితంలో ఒకసారి ఎదురయ్యే యుద్ధాన్ని చేస్తోంది. కలిసిఉండే కలుగు విజయమని ఈ పోరాటం మనకు తెలిపింది. దేశాల మధ్య సంపూర్ణ సహకారంతో కరోనాపై పోరు సలుపుతున్నాం. రికార్డు సమయంలో టీకాను ఉత్పత్తి చేయగలిగాం.  సేవే పరమ ధర్మం అనే సూత్రంపై ఆధారపడే భారత్‌ కరోనా టీకా రూపకల్పనలో తొలినుంచి కీలక పాత్ర పోషించింది. వనరులు పరిమితంగా ఉన్నా సరే సమర్ధవంతంగా వాడుకొని ప్రపంచానికి తొలి డీఎన్‌ఏ ఆధారిత కరోనా టీకాను అందించింది. కరోనా నాసల్‌ టీకా అభివృద్ధిలో భారతీయ సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారు. మానవత్వాన్ని మర్చిపోని భారత్‌ మరోమారు టీకాల ఎగుమతిని ఆరంభించింది. ప్రపంచంలో టీకాలు తయారుచేసే ఏ సంస్థయినా భారత్‌లో ఉత్పత్తి ఆరంభించవచ్చు.  

అభివృద్ధి: భారత్‌లో సంస్కరణలు ప్రపంచాభివృద్ధికి మార్గదర్శకాలు. భారత్‌ వృద్ధి బాటలో పయనిస్తే ప్రపంచం కూడా అదే బాటలో పయనిస్తుంది. అభివృద్ధి ఎప్పుడూ సమ్మిళితంగా అందరికీ అందేదిగా ఉండాలి.

పర్యావరణం: విస్తరణ, బహిష్కరణ పోటీల నుంచి సముద్రాలను కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. సముద్ర వనరులను ఉపయోగించుకోవాలి కానీ దురి్వనియోగం చేయకూడదు. అంతర్జాతీయ వాణిజ్యానికి సముద్రాలే కీలకం. వీటిని కాపాడాలుకోవడం కోసం అంతర్జాతీయ సమాజం ఏకతాటిపైకి రావాలి. నిబంధనల పాటింపు, స్వేచ్ఛాయుత నేవిగేషన్, వివాదాల శాంతియుత పరిష్కారం, ప్రజాస్వామిక విలువలు, రాజ్యాల సార్వ¿ౌమత్వం కోసం అంతా పాటుపడాలి. వాతావరణ మార్పు ప్రభావం భూగోళంపై తీవ్రంగా పడుతోంది. ప్రకృతికి అనుగుణ జీవనం సాగించడమే దీని నివారణకు మార్గం.  పారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా భారత్‌ మాత్రమే తగిన చర్యలు తీసుకుంది.  

అఫ్గానిస్తాన్‌: అఫ్గాన్‌లో సున్నితమైన పరిస్థితులను ఏ దేశం కూడా తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడాలి. ఎవరూ అఫ్గాన్‌ను స్వీయ అవసరాలకు వాడుకోకుండా నిలువరించాలి.  కల్లోల అఫ్గాన్‌కు అంతా సాయం అందించాలి. ఆదేశంలో మైనారీ్టలకు రక్షణ లభించేందుకు కృషి చేయాలి.  ‘‘మంచి పని చేసేందుకు ధైర్యంగా ముందుకు సాగితే మార్గంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ అధిగమించవచ్చు’’ అనే రవీంద్రనాధ్‌ టాగూర్‌ వ్యాఖ్యతో ప్రధాని ప్రసంగాన్ని ముగించారు.

స్వదేశానికి పయనం
ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ శనివారం స్వదేశానికి తిరుగుప్రయాణం అయ్యారు. పర్యటనలో ద్వైపాక్షిక, బహులపక్ష ఒప్పందాలు కుదిరాయన్నారు.

157 కళాఖండాలను అప్పగించిన అమెరికా
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన 157 పురాతన కళాఖండాలను అమెరికా ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అప్పగించింది. ఆయన ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కళాఖండాలను మోదీ తన వెంట స్వదేశానికి తీసుకురానున్నారు. పురాతన వస్తువుల దొంగతనం, అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రయత్నాలను బలోపేతం చేద్దామని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయించుకున్నారు. అమెరికా అప్పటించిన కళాఖండాల్లో 71 భారత ప్రాచీన సంస్కృతికి చెందినవి కాగా, 60 హిందూమతానికి, 16 బౌద్ధమతానికి, 9 జైనమతానికి చెందినవి ఉన్నాయని అధికార వర్గాలు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించాయి. భారత్‌కు చెందిన ఈ అరుదైన కళాఖండాలను తిరిగి అప్పగించిన అమెరికాకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

అక్రమరవాణాదారులు వీటిని గతంలో భారత్‌లో దొంగిలించి, అంతర్జాతీయ స్మగ్లర్లకు అమ్మేశారు. పలువురి చేతులు మారి చివరకు అమెరికాకు చేరుకున్నాయి. ఇందులో 10వ, 11వ శతాబ్దానికి చెందిన విలువైన లోహ, రాతి విగ్రహాలు సైతం ఉన్నాయి. 1976 నుంచి 2013 వరకూ విదేశాల నుంచి కేవలం 13 కళాఖండాలు భారత్‌కు చేరుకున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. 2014లో మోదీ అధికారంలోకి వచి్చన తర్వాత వందలాది కళాఖండాలను విదేశాల నుంచి వెనక్కి రప్పించగలిగారని వివరించాయి.

>
మరిన్ని వార్తలు