పారిస్‌ ఒప్పందానికి.. కట్టుబడి ఉన్నది మేమే

2 Nov, 2021 05:11 IST|Sakshi
కాప్‌ సదస్సు సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని జాన్సన్‌తో ప్రధాని మోదీ

ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం

పర్యావరణహిత జీవన విధానం అలవర్చుకోవాలి

వాతావరణ మార్పులతో వ్యవసాయ రంగానికి పెను సవాళ్లు

‘కాప్‌–26’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన

పర్యావరణ పరిరక్షణకు ఐదు సూత్రాల అజెండా ప్రకటన

గ్లాస్గో: వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో పారిస్‌ ఒప్పందాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న ఏకైక దేశం భారత్‌ మాత్రమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ ఒప్పందానికి భారత్‌ సంపూర్ణంగా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఆయన సోమవారం యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)లో గ్లాస్గో నగరంలో కాప్‌–26లో భాగంగా నిర్వహించిన ప్రపంచ దేశాల అధినేతల సదస్సులో మాట్లాడారు.

మానవళి మనుగడకు ముప్పుగా మారుతున్న వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా తాము అంకితభావంతో కృషి సాగిస్తున్నామని చెప్పారు. ప్రపంచ జనాభాలో 17 శాతం మంది భారత్‌లో నివసిస్తున్నప్పటికీ మొత్తం ప్రపంచ కర్బన ఉద్గారాల్లో తమ దేశ వాటా కేవలం 5 శాతమేనని మోదీ చెప్పారు. ప్రపంచ స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో భారత్‌ నాలుగో స్థానంలో ఉందని వివరించారు. మొత్తం ఇంధన వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటాను గత ఏడేళ్లలో 25 శాతం పెంచామని పేర్కొన్నారు. ఇప్పుడు వినియోగంలో సంప్రదాయేతర ఇంధన వనరుల వాటా 40 శాతానికి చేరుకుందని తెలిపారు. 

జీవన విధానంలో మార్పులు చేసుకుంటే భూగోళాన్ని కాపాడుకోవడం సులభమేనని అభిప్రాయపడ్డారు. పర్యావరణహిత జీవన విధానాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇది గ్లోబల్‌ మిషన్‌గా మారాలని ఆకాంక్షించారు. క్లైమేట్‌ ఫైనాన్స్‌ కింద ట్రిలియన్‌ డాలర్లు అందజేస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అభివృద్ధి చెందిన దేశాలను కోరారు. సాధ్యమైనంత త్వరగా ఈ నిధులు సమకూర్చాలని విన్నవించారు. హామీలు ఇచ్చి, ఆచరించకుండా వెనుకడుగు వేస్తున్న అభివృద్ధి చెందిన దేశాలపై ఒత్తిడి పెంచుతామని, అప్పుడే న్యాయం జరుగుతుందని వెల్లడించారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో భారత్‌ సంకల్పాన్ని వివరిస్తూ ప్రధాని మోదీ ఐదు సూత్రాల ప్రణాళికలను ప్రకటించారు.

ప్రకృతితో సహ జీవనం
వాతావరణ మార్పులపై కేవలం చర్చలకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వాటిని ఎదిరించేందుకు అవసరమైన కార్యాచరణకు ఇవ్వడం లేదని మోదీ ఆక్షేపించారు. తద్వారా ఈ మార్పుల వల్ల ప్రభావితమవుతున్న దేశాలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. సంప్రదాయ పద్ధతుల ప్రకారం ప్రకృతితో కలిసి జీవించడాన్ని పాఠశాలల్లో పాఠ్య ప్రణాళికలో(సిలబస్‌) చేర్చాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇప్పటికీ ఎన్నో సంప్రదాయ తెగలు ప్రకృతితో కలిసి జీవిస్తున్నాయని గుర్తుచేశారు. ఆ పరిజ్ఞానం ఆయా తెగల ప్రజలకు ఉందని అన్నారు. ఇది ముందు తరాలకు సైతం అందాలంటే సిలబస్‌లో చేర్చాలని చెప్పారు. భారత్‌తో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ మార్పులు వ్యవసాయ రంగానికి విసురుతున్న సవాళ్లు తక్కువేమీ కాదని తెలిపారు. ఈ సవాళ్ల కారణంగా పంటల సాగు తీరే మారిపోతోందని అన్నారు.

అకాల వర్షాలు, వరదలు, పెనుగాలులు పంటలను దెబ్బతీస్తున్నాయని వివరించారు. ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లో వాతావరణ మార్పులపై పోరాటానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో తాము చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీరు, క్లీన్‌ ఇండియా మిషన్, వంట గ్యాస్‌ సరఫరా వంటి చర్యలు చేపట్టామన్నారు. ఇవన్నీ ప్రజల జీవన నాణ్యత పెరిగేందుకు దోహదపడుతున్నాయని వెల్లడించారు. బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో మోదీ సోమవారం సమావేశమయ్యారు. గ్రీన్‌ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, క్లీన్‌ టెక్నాలజీ, ఆర్థికం, రక్షణ తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించారు. జాన్సన్, మోదీ మధ్య జరిగిన తొలి భేటీ ఇదే కావడం విశేషం.

ఐదు సూత్రాల అజెండా
1. శిలాజ ఇంధనాల వినియోగానికి క్రమంగా స్వస్తి. సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచుతాం.  
2. పునరుత్పాదక ఇంధన వనరులకు పెద్ద    పీట. 2030 నాటికి దేశ ఇంధన అవసరాల్లో 50 శాతం ఇంధనం పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటాం.  
3. ఇప్పటి నుంచి 2030 దాకా ఒక బిలియన్‌ (100 కోట్ల) టన్నుల మేర కర్బన ఉద్గారాల తగ్గిస్తాం.
4. కర్బన ఉద్గారాల వల్ల ఆర్థిక వ్యవస్థపై     పడే ప్రతికూల ప్రభావాన్ని 2030 నాటికి 45 శాతం కంటే తక్కువకు పరిమితం చేస్తాం.
5. నెట్‌ జిరో(శూన్య) కర్బన ఉద్గారాలు అనే లక్ష్యాన్ని 2070 నాటికి భారత్‌ సాధిస్తుంది. 

మరిన్ని వార్తలు