పాక్‌ పీఠం షాబాజ్‌కు! ఇమ్రాన్‌ ఖాన్‌ ఏమంటున్నారు?

11 Apr, 2022 06:21 IST|Sakshi

ప్రధాని పదవికి నామినేషన్‌

ఆయన్ను అంగీకరించబోం: ఇమ్రాన్‌

మరో స్వతంత్ర పోరాటమేనని వ్యాఖ్య

నేడు ఇమ్రాన్‌ ఎంపీల రాజీనామా!

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ రాజకీయాలు మరిన్ని మలుపులు తిరుగుతున్నాయి. ప్రధానిగా పీఎంఎల్‌ (ఎన్‌) అధ్యక్షుడు షాబాజ్‌ షరీఫ్‌ (70) ఎన్నికకు రంగం సిద్ధమైంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన, తాజా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ పార్టీ పీటీఐ తరఫున షా మహ్మద్‌ ఖురేషీ ఆదివారం నామినేషన్లు వేశారు. అయితే పలు కేసులున్న షాబాజ్‌ నామినేషన్‌ను తిరస్కరించాలన్న పీటీఐ డిమాండ్‌ను సభాపతి తోసిపుచ్చారు. దాంతో సోమవారం తమ ఎంపీలంతా రాజీనామా చేస్తారని పీటీఐ సీనియర్‌ నేత బాబర్‌ అవాన్‌ ప్రకటించారు. ఇమ్రాన్‌ నివాసంలో జరిగిన పీటీఐ కోర్‌ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు చెప్పారు.

ప్రధానిగా షాబాజ్‌ను అంగీకరించేది లేదని ఇమ్రాన్‌ తేల్చి చెప్పారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి తెర తీస్తామన్నారు. దేశం కోసం మరో స్వాతంత్య్ర పోరాటం నేటి నుంచి మొదలవుతుందంటూ ట్వీట్‌ చేశారు. ‘‘కొత్తగా కొలువుదీరేది విదేశీ ప్రభుత్వమే. ఈ పరిణామాన్ని వ్యతిరేకిస్తూ వీధుల్లోకొచ్చి నిరసన తెలపండి’’ అని పీటీఐ కార్యకర్తలకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధానిని ఎన్నుకునేందుకు జాతీయ అసెంబ్లీ సోమవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా సమావేశం కానుంది. 342 మంది సభ్యులున్న సభలో ప్రధానిగా ఎన్నికవాలంటే 172 మంది మద్దతు అవసరం. ప్రస్తుత సభ కాల పరిమితి 2023 ఆగస్టుతో ముగియనుంది.

షాబాజ్‌కు సవాలే
పాక్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ సోదరుడైన షాబాజ్‌ మూడుసార్లు పంజాబ్‌ ప్రావిన్స్‌ సీఎంగా కూడా పని చేశారు. మనీ లాండరింగ్‌ కేసుల్లో షాబాజ్, ఆయన కుమారుడు హంజా 2019లో అరెస్టయ్యారు. పీఠమెక్కాక కలగూర గంపలాంటి విపక్షాలను ఏడాదికి పైగా ఒక్కతాటిపై నడపడం ఆయనకు సవాలేనంటున్నారు. ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో, ‘‘ప్రతీకార రాజకీయాలుండబోవు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది’’ అంటూ షాబాజ్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్, మాజీ మంత్రులు తదితరులు దేశం విడిచి పోకుండా ఆదేశించాలంటూ ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఉన్నతాధికారులెవరూ దేశం వదలొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.

మరిన్ని వార్తలు