‘మేడ్‌ ఇన్‌ రష్యా’ మిస్సైల్ దాడి.. ఇద్దరి దుర్మరణం.. పోలాండ్‌లో హైఅలర్ట్‌

16 Nov, 2022 07:55 IST|Sakshi

వార్సా: ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంగళవారం ఉక్రెయిన్‌ పొరుగు దేశం పోలాండ్‌ సరిహద్దులోకి ఓ మిస్సైల్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పౌరులు మృతి చెందగా.. హైఅలర్ట్‌ ప్రకటించారు.

ప్రెజెవోడో గ్రామం దగ్గర మిస్సైల్‌ దాడి జరగడంతో ఇద్దరు మరణించినట్లు తెలుస్తోంది. మిస్సైల్‌పై మేడ్‌ ఇన్‌ రష్యాగా ఉన్నట్లు పోలాండ్‌ అధికారులు గుర్తించారు.  అయితే మిస్సైల్‌ దాడి చేసింది రష్యా అనేందుకు ఆధారాలు లేవని, అయినప్పటికీ వివరణ కోరుతూ మాస్కో రాయబారికి సమన్లు జారీ చేసినట్లు వార్సా ప్రకటించింది. మరోవైపు ఇదే విషయాన్ని పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడా, మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన అన్నారు.

ఇక ఈ పరిణామంతో పోలాండ్‌ జాతీయ భద్రతా మండలి అత్యవసర భేటీ నిర్వహించింది. మరోవైపు సరిహద్దులో పోలాండ్‌ సైన్యం అప్రమత్తం అయ్యింది. ఇంకోవైపు పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్ దుడాతో, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఫోన్‌లో చర్చించారు. ఈ ఘటనపై పోలాండ్‌ నిర్వహించే దర్యాప్తునకు పూర్తిస్థాయి సహకారం ఉంటుందని బైడెన్‌ తెలిపారు. నాటో చీఫ్‌ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్‌ తోనూ బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. బుధవారం నాటో రాయబారులు పోలాండ్‌ మిస్సైల్‌ దాడి వ్యవహారంపై అత్యవసరంగా భేటీ కానున్నారు.

ఇదీ చదవండి: ఉక్రెయిన్‌పై 100 మిసైల్స్‌తో విరుచుకుపడిన రష్యా

మరిన్ని వార్తలు