నకిలీ వ్యాక్సిన్లు అమ్ముతున్న చైనా ముఠా

3 Feb, 2021 16:56 IST|Sakshi

ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తున్న వైనం

బీజింగ్‌: మహమ్మారి కరోనా భయాలు వెంటాడుతున్న వేళ నేరగాళ్లు వైరస్‌ పేరు చెప్పి అందినకాడికి దోచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కషాయాలతో కోవిడ్‌ను కట్టడి చేయవచ్చంటూ కొందరు, కరోనా ఫేక్‌ సర్టిఫికెట్లతో మరికొందరు ప్రజలను దోచుకున్న అనేక ఉదంతాలు గతంలో బయటకు వచ్చాయి. ఇక కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో ఏకంగా నకిలీ వ్యాక్సిన్ల అమ్మకానికి తెరతీశారు దుండగులు. సాధారణ సెలైన్‌ మిశ్రమాన్ని టీకా పేరిట అమ్ముకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ ముఠాను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నారు. 3 వేలకు పైగా నకిలీ డోసులను స్వాధీనం చేసుకున్నారు. రాజధాని బీజింగ్‌ సహా జియాన్సు, షాన్‌డాంగ్‌ ప్రావిన్సులలో గత నాలుగు నెలలుగా వీరి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇతర దేశాలకు కూడా వీరు వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్బిన్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ... ‘‘వ్యాక్సిన్‌ పంపిణీ విషయంలో చైనా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. నకిలీ టీకాలు అమ్ముతూ అక్రమ వ్యాపారాలకు తెరతీసిన నేరగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తాం.

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఇతర దేశాలతో పరస్పరం సమాచారం పంచుకుంటూ, అక్రమార్కుల జాడ తెలుసుకుంటాం’’  అని హెచ్చరికలు జారీ చేశారు. కఠినమైన శిక్షలు విధించే విధంగా నిబంధనలు తీసువస్తున్నట్లు తెలిపారు. కాగా చైనాలో ప్రస్తుతం సుమారు 7 కోవిడ్‌ వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి. ఇక సినోఫాం పేరిట తీసుకువచ్చిన ప్రభుత్వ టీకా వినియోగానికి ఇటీవలే ఆమోదం లభించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు