యూఎస్‌ ‘క్యాపిటల్‌’ వద్ద దాడి

3 Apr, 2021 06:12 IST|Sakshi

కారుతో పోలీసులపైకి దూసుకెళ్లిన దుండగుడు

ఒక పోలీసు అధికారి మృతి; పోలీసుల కాల్పుల్లో దుండగుడు హతం

వాషింగ్టన్‌: అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్‌ వద్ద భద్రత విధుల్లో ఉన్న పోలీసు అధికారులపైకి శుక్రవారం ఒక దుండగుడు కారుతో దూసుకువెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒక అధికారి మరణించారు. కారులో నుంచి కత్తి పట్టుకుని దిగుతున్నట్లుగా కనిపించిన ఆ దుండగునిపై పోలీసులు వెంటనే  కాల్పులు జరిపారు. అనంతరం, గాయపడిన పోలీసు అధికారులతో పాటు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు.

ఆ దుండగుడు కూడా మరణించాడని స్థానిక మీడియా పేర్కొంది. క్యాపిటల్‌ భవనం వద్ద సెనెట్‌ వైపు ఉన్న ప్రవేశ ద్వారానికి 100 గజాల దూరంలో ఉన్న చెక్‌పాయింట్‌ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అనంతరం క్యాపిటల్‌ కాంప్లెక్స్‌ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం యూఎస్‌ పార్లమెంటు సమావేశాలు జరగడం లేదు. సుమారు మూడు నెలల క్రితం, దేశాధ్యక్షుడిగా జో బైడెన్‌ గెలుపును పార్లమెంట్‌ నిర్ధారిస్తున్న సమయంలో, మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంలోనికి చొచ్చుకువచ్చి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు