అరబ్‌ దేశంలో పోప్‌ ఫ్రాన్సిస్‌ చారిత్రక పర్యటన

7 Mar, 2021 02:52 IST|Sakshi
ఇరాక్‌లోని నజాఫ్‌లో షియాల గ్రాండ్‌ అయతొల్లా అలీ అల్‌ సిస్తానీతో పోప్‌ ఫ్రాన్సిస్

గ్రాండ్‌ అయతొల్లా అల్‌సిస్తానీతో భేటీ

పవిత్ర నజాఫ్‌లో మతపెద్దలతో సమావేశం

ఉర్‌: కేథలిక్‌ మత పెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌(84) అరబ్‌ దేశం ఇరాక్‌లో మొట్టమొదటిసారిగా పర్యటిస్తున్నారు. శనివారం ఆయన ఇరాక్‌లోని పవిత్ర నగరం నజాఫ్‌లో షియాల గ్రాండ్‌ అయతొల్లా అలీ అల్‌– సిస్తానీ(90)తో భేటీ అయ్యారు. ఈ చారిత్రక సమావేశంలో ఇరువురు మతపెద్దలు శాంతియుత సహజీవనం సాగించాలని ముస్లింలను కోరారు. ఇరాక్‌లోని క్రైస్తవులను కాపాడుకోవడంలో మతాధికారులు కీలకపాత్ర పోషించాలని, ఇతర ఇరాకీయుల మాదిరిగానే వారు కూడా సమానహక్కులతో స్వేచ్ఛగా జీవించాలని గ్రాండ్‌ అయతొల్లా అలీ అల్‌– సిస్తానీ ఆకాంక్షించారు. తన వద్దకు వచ్చేందుకు శ్రమ తీసుకున్న పోప్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అత్యంత బలహీనవర్గాలు, తీవ్ర వేధింపులకు గురయ్యే వారి పక్షాన గళం వినిపించినందుకు పోప్‌ ఫ్రాన్సిస్‌ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారని వాటికన్‌ పేర్కొంది. ఇరాక్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియాలు గౌరవించే మత పెద్దల్లో అల్‌ సిస్తానీ ఒకరు. అల్‌ సిస్తానీ నివాసంలో జరిగిన ఈ భేటీకి కొన్ని నెలల ముందు నుంచే అయతొల్లా కార్యాలయం, వాటికన్‌ అధికారుల మధ్య తీవ్ర కసరత్తు జరిగినట్లు సమాచారం. గ్రాండ్‌ అయతొల్లా భేటీతో ఇరాక్‌లోని షియా సాయుధ ముఠాల వేధింపుల నుంచి క్రైస్తవులకు భద్రత చేకూర్చడం, క్రైస్తవుల వలసలను నిరోధించడమే పోప్‌ ఫ్రాన్సిస్‌ పర్యటన ఉద్దేశంగా భావిస్తున్నారు. 

40 నిమిషాల సేపు చర్చలు
పోప్‌ ఫ్రాన్సిస్‌ శనివారం బుల్లెట్‌ ప్రూఫ్‌ మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో నజాఫ్‌కు బయలుదేరి వెళ్లారు. షియాలు అత్యంత పవిత్రంగా భావించే ఇమామ్‌ అలీ సమాధి ఉన్న రసూల్‌ వీధిలోని అల్‌ సిస్తానీ నివాసానికి కాలినడకన చేరుకున్నారు. అక్కడ, ఆయనకు సంప్రదాయ దుస్తులు ధరించిన కొందరు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పోప్‌ శాంతి చిహ్నంగా పావురాలను గాలిలోకి వదిలారు. పోప్‌ తన షూస్‌ వదిలేసి అల్‌ సిస్తానీ ఉన్న గదిలోకి ప్రవేశించారు. సందర్శకుల రాక సమయంలో సాధారణంగా తన సీట్లో కూర్చుని ఉండే అల్‌ సిస్తానీ లేచి నిలబడి, పోప్‌ ఫ్రాన్సిస్‌ను తన గదిలోకి ఆహ్వానించారనీ, ఇది అరుదైన గౌరవమని చెప్పారు. మాస్కులు ధరించకుండానే ఇరువురు పెద్దలు దగ్గరగా కూర్చుని మాట్లాడుకున్నారని చెప్పారు. వారి భేటీ సుహృద్భావ వాతావరణంలో 40నిమిషాల పాటు సాగిందని నజాఫ్‌కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అల్‌ సిస్తానీయే ఎక్కువ సేపు మాట్లాడారన్నారు.

ఫ్రాన్సిస్‌కు టీ, బాటిల్‌ నీళ్లు అందజేయగా, ఆయన నీరు మాత్రమే తాగారని చెప్పారు. అయితే, ఇప్పటికే కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న పోప్‌.. శుక్రవారం బాగ్దాద్‌లో పలువురితో సమావేశం కావడం, అల్‌ సిస్తానీ కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకపోవడం నేపథ్యంలో కొంత ఆందోళన వ్యక్తమైందని కూడా ఆయన అన్నారు. అనంతరం ఆయన పురాతన ఉర్‌ నగరంలో సర్వమత సమ్మేళానికి వెళ్లారు. అక్కడ, మత పెద్దలంతా గౌరవపూర్వకంగా లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. మాస్కు ధరించి పోప్‌ ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇరాక్‌లోని ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు శతాబ్దాలుగా ఉన్న వైరాన్ని మరిచి శాంతి, ఐక్యతల కోసం కృషి చేయాలని ఆయన కోరారు. క్రైస్తవులు, ముస్లింలు, యూదుల విశ్వాసాలకు మూలపురుషుడిగా భావించే అబ్రహాం జన్మించింది ఉర్‌లోనే కావడం విశేషం. శుక్రవారం ఇరాక్‌ చేరుకున్న పోప్‌ ఫ్రాన్సిస్‌ మొదటి రోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలయ్యాక పోప్‌ చేపట్టిన మొదటి పర్యటన ఇదే. గ్రాండ్‌ అయతొల్లాతో భేటీ అయిన మొదటి పోప్‌ కూడా ఆయనే. పోప్‌ రాక సందర్భంగా నజాఫ్‌లో 25 వేల మంది బలగాలు భారీ బందోబస్తు చేపట్టాయి.‌ 

మరిన్ని వార్తలు