Russia Ukraine War: పెను ప్రమాదం ముంగిట ఉక్రెయిన్‌.. ఆందోళనలో ప్రపంచ దేశాలు

9 Mar, 2022 20:10 IST|Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని అణు విద్యుత్‌ కేంద్రాలను రష్యా బలగాలు తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. కాగా, చెర్నోబిల్​ న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్​ విషయంలో అంతర్జాతీయ అణు శక్తి కేంద్రం(IAEA) ఆందోళన వ్యక్తం చేసింది. చెర్నోబిల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు బుధవారం ప్రకటించింది. రెండు వారాలుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. రష్యా బలగాలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడి స్టాఫ్‌ పరిస్థితి మీద కూడా ఎలాంటి అప్‌డేట్‌ లేదు అని తెలిపింది. ఇదిలా ఉండగా.. 210 మంది టెక్నీషియన్ల సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమిస్తోందని అటామిక్‌ ఏజెన్సీకి ఉక్రెయిన్‌ ఒక నివేదిక ఇచ్చింది.

తాజాగా.. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్‌ న్యూక్లియర్ ప్లాంట్​కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని బిగ్‌ బాంబ్‌ పేల్చారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్​కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్​లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లకు కేవలం 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉందని వెల్లడించారు. ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్​ను చల్లార్చే వ్యవస్థలపై ప‍్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్​ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా దాడుల కారణంగానే చెర్నోబిల్​కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే గ్రిడ్​కు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందన్నారు. 

మరోవైపు ఉక్రెయిన్‌పై సైనిక చర్య విషయంపై రష్యా మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఉక్రెయిన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ బలగాలు పనిచేయడం లేదని, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూలగొట్టే అవసరం రష్యా మిలిటరీకి లేదని స్పష్టం చేసింది. తాము చర్చలకు ప్రాధాన్యత ఇస్తామని, చర్చల ద్వారానే లక్ష్యాలను సాధిస్తామని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా తెలిపారు. కాగా ఉక్రెయిన్‌-రష్యా మధ్య నేడు(బుధవారం) మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేగాక రష్యా సైనిక చర్య పక్కా ప్రణాళిక పరంగా ముందుకు సాగుతోందన్నారు.

మరిన్ని వార్తలు