సూరీడుకి కోపమొచ్చిందా? అలా ఇప్పుడొస్తే.. అల్లకల్లోలమే!

13 Jul, 2021 00:27 IST|Sakshi

అది 1859వ సంవత్సరం.. సెప్టెంబర్‌ ఒకటో తేదీ.. అంతా ఆఫీసుల్లో పనిచేసుకుంటున్నారు. ఉన్నట్టుండి రేడియోలన్నీ ఏదేదో చిత్రమైన శబ్దం చేస్తూ మూగబోయాయి.. కాసేపటికే టెలిగ్రాఫ్‌ లైన్లలో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి మంటలు చెలరేగాయి. ఆఫీసులు కాలిపోయాయి. ఒకటి రెండు చోట్లనో కాదు.. ఉత్తర అమెరికా, యూరప్‌ ఖండాల్లోని చాలా దేశాల్లో ఇదే కలకలం. దీనంతటికీ కారణం ఓ సౌర తుఫాను.. ఇప్పుడు కూడా అలాంటి ఓ సౌర తుఫాను వస్తోంది. దాని రేడియేషన్, విద్యుదయస్కాంత శక్తి వల్ల సమాచార, విద్యుత్‌ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. మరి ఈ సౌర తుఫానులు ఏంటి, ఎందుకు, ఎప్పుడు ఏర్పడుతాయి, ప్రమాదం ఏమిటన్న వివరాలు తెలుసుకుందామా?     
–సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

ఏమిటీ సౌర తుఫానులు 
సూర్యుడు కొన్ని కోట్ల డిగ్రీల ఉష్ణోగ్రతలో కుతకుత ఉడుకుతూనే ఉంటాడు. ఆ పరిస్థితిలో హైడ్రోజన్‌ అణువులు సంలీనమై హీలియంగా మారుతూ భారీ ఎత్తున శక్తి విడుదల అవుతుంది. ఆ శక్తి కాంతి ‘ఫోటాన్ల’రూపంలో ప్రసరిస్తుంది. ఇదే మనకు అందే సూర్యరశ్మి. అయితే భారీ ఉష్ణోగ్రతలు, పీడనం వల్ల సూర్యుడిపై పదార్థమంతా ప్లాస్మా (ద్రవానికి, ఘనానికి మధ్య) స్థితిలో ఉంటుంది. సూర్యుడి అయస్కాంత క్షేత్రంలో మార్పులు జరిగినప్పుడు.. ఈ ప్లాస్మా తీవ్ర ఒత్తిడికి లోనై ఒక్కసారిగా విస్ఫోటం చెందుతుంది. ఆ ప్లాస్మాతో కూడిన విద్యుదయస్కాంత వికిరణాలు (ఎలక్ట్రో మ్యాగ్నటి క్‌ రేస్‌).. అతి వేగంతో అంతరిక్షంలోకి విడుదలవుతాయి. కోట్ల కిలోమీటర్లు ప్రయాణిస్తూ.. మార్గమధ్యలో ఉండే గ్రహాలపై ప్రభావం చూపిస్తాయి. 

మనుషులకు ప్రమాదకరమా? 
సౌర తుఫానుల వల్ల మనుషులకు నేరుగా ప్రమాదం కలిగే అవకాశాలు అతి స్వల్పమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమికి ఉన్న అయస్కాంత క్షేత్రం, వాతావరణం కలిసి.. సూర్యుడి ప్లాస్మా వికిరణాలను, రేడియేషన్‌ను చాలావరకు అడ్డుకుంటాయని వివరిస్తున్నారు. చాలా శక్తివంతమైన సౌర తుఫానులు భూమిని తాకితే.. నేరుగా ఎండ తగిలే లా ఉన్నవారిపై కాస్త రేడియేషన్‌ ప్రభావం ఉండొ చ్చని, కానీ అది స్వల్పమేనని స్పష్టం చేస్తున్నారు. 

ప్రతి పదకొండు ఏళ్లకోసారి.. 
సూర్యుడి స్వీయ భ్రమణం, పాలపుంతలోని ఇతర నక్షత్రాల ప్రభావం వల్ల.. సూర్యుడి అయస్కాంత ధ్రువాలు ప్రతి 11 ఏళ్లకోసారి తారుమారు అవుతుంటాయి. అంటే ఉత్తర ధ్రువం దక్షిణంగా, దక్షిణ ధ్రువం ఉత్తరంగా మారుతుంటాయి. ఈ క్రమంలో అయస్కాంత శక్తి చిక్కుపడి ప్లాస్మా విస్ఫోటనం చెంది సౌర తుఫానులు ఏర్పడుతాయి. ప్రతి పదకొండేళ్లకు ఇలా సౌర తుఫానులు ఏర్పడుతున్నా.. కొన్నిసార్లు మామూలుగా, మరికొన్నిసార్లు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అవన్నీ కూడా అంతరిక్షంలో వివిధ దిక్కుల్లోకి విడుదలవుతుంటాయి. కొన్నిసార్లు మాత్రమే భూమి వైపు వస్తుంటాయి. 


1859లో భారీ సౌర తుఫాను వచ్చినప్పటికి ఉన్న కమ్యూనికేషన్‌ టెక్నాలజీలు కేవలం రేడియో, టెలిగ్రాఫ్‌ లైన్లు మాత్రమే. అందువల్ల ఆ తుఫాను దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా రేడియోలు మూగబోయాయి. సౌర తుఫాను విద్యుదయస్కాంత ప్రభావం వల్ల ఉత్తర అమెరికా, యూరప్‌ ఖండాల్లో టెలిగ్రాఫ్‌ లైన్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఆ సౌర తుఫానును గుర్తించిన రిచర్డ్‌ క్యారింగ్టన్‌ పేరు మీదుగా.. ఆ ఘటనకు ‘క్యారింగ్టన్‌ ఈవెంట్‌’గా పేరు పెట్టారు. 
1989లో ఏర్పడిన సౌర తుఫాను కారణంగా కెనడాలో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ కుప్పకూలింది.

అలా ఇప్పుడొస్తే.. అల్లకల్లోలమే.. 
1859 నాటి స్థాయి సౌర తుఫాను ఇప్పుడు వస్తే.. కమ్యూనికేషన్, విద్యుత్‌ సరఫరా వ్యవస్థలు మొత్తం కుప్పకూలిపోతాయని హార్వర్డ్‌ ఆస్ట్రానమీ శాస్త్రవేత్త అబ్రహం లోబ్‌ వెల్లడించారు. లక్షలాది పరికరాలు పాడైపోతాయని, కొద్దిరోజులు కోట్ల మంది చీకట్లో మగ్గాల్సి వచ్చేదని తెలిపారు. అదే జరిగితే కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. 2014లో ఒక భారీ సౌర తుఫాను వచ్చినా.. భూమి ముందుకు వెళ్లిపోవడంతో త్రుటిలో తప్పించుకున్నామ న్నారు. అదే 9 రోజులు ముందు వచ్చి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేదని వివరించారు. వచ్చే వందేళ్లలో ప్రమాదకర సౌర తుఫాను భూమిని తాకే అవకాశం ఉందని చెప్పారు. 

దేనిపై ప్రభావం.. ఎంత ప్రమాదం 
సౌర తుఫానుల కారణంగా విద్యుదయస్కాంత తరంగాలపై ఆధారపడి పనిచేసే కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా శాటిలైట్‌ సిగ్నళ్లు, జీపీఎస్‌ నావిగేషన్, మొబైల్‌ ఫోన్‌ సిగ్నళ్లు, డీటీహెచ్‌ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడుతుంది. సౌర తుఫాను మరీ తీవ్రంగా ఉంటే పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. 
సూర్యుడి ప్లాస్మా వికిరణాలు విద్యుత్‌ సరఫరా లైన్లపై ప్రభావం చూపిస్తాయి. ఓల్టేజీ ఒక్కసారిగా పెరిగిపోయి.. ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతింటాయి. విద్యుత్‌ గ్రిడ్‌ కుప్పకూలిపోతుంది. వాటన్నింటినీ మరమ్మతు చేయడమో, కొత్తవి ఏర్పాటు చేయడమో జరిగేదాకా విద్యుత్‌ సరఫరా ఆగిపోయినట్టే. 

ఆకాశంలో అందమైన కాంతులు ఇవే.. 
భూమి ఉత్తర, దక్షిణ ధ్రువాల వద్ద అప్పుడప్పుడూ వివిధ రంగుల్లో అందమైన కాంతి పుంజాలు (అరోరాలు) ఏర్పడుతుంటాయి. వాటికి కారణం సూర్యుడి విద్యుదయస్కాంత వికిరణాలే. భూమివైపు వస్తు న్న ఆ వికిరణాలను భూమి వాతావరణం, అయస్కాంత క్షేత్రం అడ్డుకున్నప్పుడు ఏర్పడే చర్యల్లో.. అలా రంగురంగుల అరోరాలు ఏర్పడుతాయి.   

మరిన్ని వార్తలు