ఇండియాలోని అత్తమామలు ఐఫోన్లు కొనివ్వాలని ఇబ్బంది పెడుతున్నారు.. కెనడా మహిళ ఆవేదన

7 Dec, 2022 20:22 IST|Sakshi

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం చాలా మంది విదేశాలకు వెళుతుంటారు. మంచి జీతంతో ఉద్యోగం దొరకడంతో అక్కడే స్థిరపడుతుంటారు. కష్టమైనా సరే పుట్టిన ఊరు,కుటుంబానికి దూరంగా జీవిస్తుంటారు. భారత్‌ నుంచి కూడా అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ వంటి దేశాలకు పయనమవుతుంటారు. ఎవరైనా విదేశాల్లో ఉంటున్నారనగానే లక్షలు, కోట్లలో డబ్బులు సంపాదిస్తుంటారనే ముందుగా అందరూ అనుకుంటారు. కానీ అందరి పరిస్థితి అలా ఉండదు. అక్కడికి వెళ్లి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పాకెట్‌ మనీ కోసం పార్ట్‌టైమ్‌ జామ్‌లు చేస్తుంటారు. ఈ కష్టాలన్నీ ఊర్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులకు తెలియవు.

తాజాగా ఓ కెనడియన్ మహిళ కథ వింటే మీకే అర్థమవుతుంది. కెనడాకు చెందిన మహిళ ఇండియన్‌ వ్యక్తిని పెళ్లాడింది. ప్రస్తుతం ఆమె గర్భవతి. మరికొన్ని వారాల్లో ఆ మహిళ తమ తొలి బిడ్డకు జన్మనివ్వనుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతం అవుతోంది ఈ జంట. ఇంకా బిడ్డ పుట్టాక ఖర్చులు పెరుగుతాయి. ఈ క్రమంలో ఇండియాలో నివసిస్తున్న తమ అత్త మామలు ఐఫోన్‌లు కావాలని డిమాండ్‌ చేస్తున్నారని ఆ మహిళ వాపోయింది. ఈ మేరకు తన ఇబ్బందికరమైన సరిస్థితిని  రెడిస్ట్‌ పోస్ట్‌లో చెప్పుకొచ్చింది.

‘నేను కెనడియన్ మరియు నా భర్త భారతీయుడు. మేము కెనడాలో నివసిస్తున్నాము. అతని కుటుంబం భారతదేశంలో ఉంది. మేము మా మొదటి బిడ్డను కొన్ని వారాల్లో స్వాగతిస్తాము. కెనడాలో నివసిస్తున్నందున మేము ధనవంతులమని నా భర్త కుటుంబం ఆలోచిస్తుంది. నిజానికి మేము చాలా కష్టాల్లో ఉన్నాం. మా దగ్గర వాళ్లు అనుకుంటున్నంతా డబ్బులు లేవు. అంతేగాక త్వరలో బిడ్డ వస్తుండటంతో ఖర్చులు కూడా తగ్గించాం. కానీ వాళ్లు అది అర్థం చేసుకోవడం లేదు. మా అత్త మామలు వారికి 2 ఐఫోన్‌లను బహుమతిగా ఇవ్వాలని అడిగారు.  ఆర్థిక పరిస్థితి సరిగా లేని సమయంలో నా భర్త కూడా వారికి కొనిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇది తెలిసి నేను షాకయ్యా.

పిల్లలు పుట్టే ముందు ఇలాంటి పెద్ద బహుమతులు అడగటం సాధారణమేనా. అత్తమామల పట్ల వారి సంస్కృతి, సంప్రదాయాలు నాకు పెద్దగా తెలీవు. ఇవి చాలా సున్నితంగా విషయాలని నేను భావిస్తున్నాను. నా సమస్యేంటో అర్థం చేసుకోడానికి ప్రయత్నించండి. ’ అంటూ  తన బాధలను చెప్పుకొచ్చింది.  ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు భారీగా స్పందింస్తున్నారు.

‘అమ్మా, నాన్న మీకు ఇవ్వగలిగిన గొప్ప బహుమతి మీ మనవడే.  ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది’  అంటూ ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. మరొకరు ‘మీ భర్తకు ఐఫోన్‌ ఇవ్వాలని అంత ఆసక్తిగా ఉంటే సెకండ్‌ హ్యండ్‌లో కొని ఇవ్వమనండి. అప్పుడైనా కొంత డబ్బు ఆదా అవుతుంది. ’ అంటూ ఓ నెటిజన్‌ సెటైర్‌ వేశారు. ‘ఇక్కడ సమస్య ఏంటంటే మీ భర్త తన తల్లిదండ్రులకు మీ ఆర్థిక పరిస్థితి గురించి సరిగా కమ్యూనికేట్‌ చేయకపోవడం. తన ఆర్థిక స్థితి సరిగా లేదని, ప్రస్తుత సమయంలో ఈ పని చేయలేనని చెప్పమనండి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే భారతీయ తల్లిదండ్రులు, సాధారణంగా తమ పిల్లలను విదేశాలకు పంపేటప్పుడు వారు అప్పులు చేయడంతో సహా చాలా త్యాగం చేస్తారని తెలుసుకోండి’ అని తెలిపారు. 

నెటిజన్ల సలహాలు, కామెంట్లపై స్పందించిన సదరు మహిళ.. వారికి కృతజ్ఞతలు తెలిపింది.  ఐఫోన్‌లకు బదులు కొంత తక్కువ ఖరీదైన ఫోన్‌లు వారికి నచ్చినవి కొనుగోలు చేసేందుకు అత్తమామలు అంగీకరించారని తెలిపింది. అలాగే చాలా మంది సూచించిన విధంగా వాటిని భారతదేశానికి పంపుతున్నట్లు పేర్కొంది.

మరిన్ని వార్తలు