వరుసగా మూడోసారీ జిన్‌పింగ్‌కే పట్టం!

9 Nov, 2021 02:16 IST|Sakshi

‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా’ ప్లీనరీ ప్రారంభం 

చరిత్రాత్మక తీర్మానం చేసే అవకాశం

బీజింగ్‌: డ్రాగన్‌ దేశం చైనాలో అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా(సీపీసీ) వందేళ్ల చరిత్రలో గతంలో ఎన్నడూ చేయని తీర్మానాన్ని ఆమోదించేందుకు రంగం సిద్ధమయ్యింది. జీ జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నుకొంటూ చరిత్రాత్మక తీర్మానం చేయబోతున్నట్లు సమాచారం. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ చైనా 19వ సెంట్రల్‌ కమిటీ ఆరో ప్లీనరీ సోమవారం చైనా రాజధాని బీజింగ్‌లో ప్రారంభమయ్యింది. ఈ సమావేశం నాలుగు రోజులపాటు జరగనుంది. తొలిరోజు 400 మంది సీపీసీ కేంద్ర కమిటీ సభ్యులు హాజరయ్యారు. సీపీసీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ తమ ప్రభుత్వ పనితీరుపై ఒక నివేదికను ఈ సందర్భంగా సమర్పించారు.

వందేళ్లలో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయాలను వివరిస్తూ పొలిటికల్‌ బ్యూరో తరపున ఒక ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైనా నూతన అధ్యక్షుడిని 2022లో ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సీపీసీ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు సమాచారం. పార్టీ వందేళ్ల చరిత్రను, జయాపజయాలను సమీక్షించుకోవడానికి, భవిష్యత్తు నాయకత్వానికి బాటలు వేయడానికి ప్లీనరీ జరుగుతున్నట్లు నాన్‌జింగ్‌ యూనివర్సిటీలోని పొలిటికల్‌ సైంటిస్టు గూ సూ చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సాధించిన ఘనతలను గుర్తుచేసుకొని, ప్రశంసించాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందన్నారు. సీపీసీ ప్లీనరీలో సాధారణంగా పార్టీ వ్యవహారాలు, కీలకమైన నియామకాలు, పార్టీ సిద్ధాంతాలు, భావజాలం, పార్టీ నిర్మాణంపై చర్చిస్తుంటారు.

జీవితకాలం అదే పదవిలో? 
చైనాలోని మూడు ముఖ్యమైన అధికార కేంద్రాలు 68 ఏళ్ల జిన్‌పింగ్‌ ఆధీనంలోనే ఉన్నాయి. ఆయన సీపీసీ ప్రధాన కార్యదర్శిగా, శక్తివంతమైన సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌(సీఎంసీ) చైర్మన్‌గా(త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌), చైనా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనుంది. ఆయన ఇప్పటికే వరుసగా రెండుసార్లు అధ్యక్ష పీఠం దక్కించుకున్నారు. గత తొమ్మిదేళ్ల పాలనలో మావో జెడాంగ్‌ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. అధ్యక్షుడిగా వరుసగా మూడోసారి కొనసాగనున్నట్లు తెలుస్తోంది. జిన్‌పింగ్‌ తన జీవితకాలం అదే పదవిని అంటిపెట్టుకొని ఉండే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. జిన్‌పింగ్‌కు 2016లో కమ్యూనిస్టు పార్టీలో ‘అత్యంత కీలకమైన నాయకుడు’ అన్న హోదా లభించింది.  

మరిన్ని వార్తలు