తప్పిస్తారా ? తప్పించాలా?

9 Jan, 2021 04:27 IST|Sakshi
ట్రంప్‌ను అభిశంసించాలంటూ బ్రూక్లిన్‌లో ప్రదర్శన

అధ్యక్షుడు ట్రంప్‌ తొలగింపుపై ఉపాధ్యక్షుడికి స్పీకర్‌ నాన్సీ సూటి ప్రశ్న  

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు క్యాపిటల్‌ భవనంపై దాడి ప్రకంపనలు అమెరికాని కుదిపేస్తున్నాయి. జనవరి 20కి ముందే ట్రంప్‌ని గద్దె దింపాలన్న డిమాండ్లు హోరెత్తిపోతున్నాయి. కాంగ్రెస్‌ సభ్యులందరూ ట్రంప్‌ని ఇంటికి పంపాలని గట్టిగా డిమాండ్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసి మీరు ట్రంప్‌ని తొలగిస్తారా? లేదంటే ఆ పని మేమే చెయ్యాలా అని ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ని ప్రశ్నించారు.

గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా ఉపా«ధ్యక్షుడు, కేబినెట్‌ మంత్రులు ట్రంప్‌ని గద్దె దింపాలని డిమాండ్‌ చేశారు. ట్రంప్‌ అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి అని ఆయన చేసింది దేశద్రోహమని విమర్శించారు. ఉపాధ్యక్షుడు ట్రంప్‌ని తొలగించకపోతే ప్రజల డిమాండ్‌ మేరకు తామే అభిశంసన తీర్మానం ద్వారా ఆయన్ను ఇంటికి పంపిస్తామన్నారు. ట్రంప్‌ని గద్దె దింపడం ఇప్పుడు దేశ తక్షణ అవసరమని నాన్సీ వ్యాఖ్యానించారు.  

వాళ్లంతా దేశీయ ఉగ్రవాదులు: బైడెన్‌
ట్రంప్‌ ప్రజాస్వామ్య ధిక్కార చర్యలతో క్యాపిటల్‌ భవనంలో హింసాకాండ చెలరేగిందని కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌ అన్నారు. దాడికి దిగిన వారంతా చొరబాటుదార్లు, ఉగ్రవాదులని బైడెన్‌ వ్యాఖ్యానించారు. గత నాలుగేళ్లుగా ట్రంప్‌ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాల్ని తన చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించారని,అందుకే ఈ దుస్థితి దాపురించిందన్నారు.

కేబినెట్‌ మంత్రుల రాజీనామా
ట్రంప్‌ మద్దతుదారులు సాగించిన హింసాకాండకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కేబినెట్‌ మంత్రులు ఒక్కొక్కరుగా పదవి నుంచి తప్పుకుంటున్నారు. విద్యాశాఖ మంత్రి బెట్సీ దెవోస్, రవాణా శాఖ మంత్రి ఎలైన్‌ చావోలు రాజీనామా చేశారు. ‘‘ప్రభుత్వాన్ని వీడడానికి ముందు మనం సాధించిన ఘనతలు గురించి చాటి చెప్పాలనుకున్నాం. కానీ మీ మద్దతుదారులు చేసిన బీభత్సకాండతో మన మీద పడ్డ మచ్చని చెరిపేసుకోవడానికి ప్రయత్నించాల్సి వస్తోంది’’అని బెట్సీ తన రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనని చాలా మనస్తాపానికి గురి చేసిందని అందుకే రాజీనామా చేస్తున్నానని రవాణా మంత్రి ఎలైన్‌ పేర్కొన్నారు.  

బైడెన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్లను                  
అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తాను హాజరు కావడం లేదని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు. కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటిదాకా పని చేసిన అధ్యక్షుడు హాజరు కావడం అమెరికాలో ఒక సంప్రదాయంగా వస్తోంది.

మరిన్ని వార్తలు