షాకింగ్! బిన్ లాడెన్ కుటుంబం నుంచి భారీ విరాళం తీసుకున్న బ్రిటన్ ప్రిన్స్‌!

31 Jul, 2022 17:39 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ రాజవంశ వారసుడు ప్రిన్స్ చార్లెస్‌.. ఒసామా బిన్ లాడెన్ కుటుంబం నుంచి ఒక మిలియన్ పౌండ్లు(రూ.9.6కోట్లు) విరాళంగా తీసుకున్నారని ది సండే టైమ్స్ వెల్లడించింది. ఈ మొత్తం చార్లెస్‌కు చెందిన చారిటబుల్‌ ట్రస్టులో జమ అయినట్లు తెలిపింది. అమెరికా ట్విన్ టవర్లపై దాడి(9/11) ఘటనలో బిన్ లాడెన్ ప్రధాన సూత్రధారి. అలాంటిది ఆయన సోదరులు బకర్ బిన్ లాడెన్‌, షఫీక్‌ల నుంచి ప్రిన్స్ చార్లెస్ భారీ విరాళం తీసుకోవడం చర్చనీయాంశమైంది.

అయితే సౌదీకి చెందిన వీళ్లు ఏదైనా తప్పు చేశారా? అనే విషయంపై మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కానీ ఇప్పటికే నేరపూరిత ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్స్ చార్లెస్ చారిటబుల్ ట్రస్టులపై అధికారుల నిఘా మరింత పెరిగింది.

2013లో బకర్ లాడెన్‌ను ప్రిన్స్ చార్లెస్‌ లండన్లో కలిసినప్పుడు ప్రిన్స్‌ ఆఫ్ వేల్స్ చారిటబుల్ ఫండ్‌(పీడబ్ల్యూసీఎఫ్‌)కు విరాళం అందిందని నివేదిక తెలిపింది. ట్రస్టు సలహాదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా ప్రిన్స్ దీన్ని అంగీకరించారని పేర్కొంది. అయితే ఆ సమయంలో ట్రస్టులోని ఐదుగురు సభ్యులు విరాళం తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని పీడబ్ల్యూసీఎఫ్‌ ఛైర్మన్ ఇయాన్ చెషైర్ వెల్లడించారు.

సౌదీ వ్యాపారవేత్తతో క్యాష్ ఫర్ ఆనర్స్‌  కుంభకోణం ఆరోపణలపై ప్రిన్స్ చార్లెస్‌కు చెందిన మరో చారిటబుల్ ట్రస్టుపై బ్రిటిష్ పోలీసులు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ అనంతరం ప్రిన్స్ పౌండేషన్ ముఖ్య అధికారి గతేడాదే రాజీనామా చేశారు.
చదవండి: సర్వస్వం కోల్పోయినా పెంపుడు కుక్కను మాత్రం వదల్లేదు..

మరిన్ని వార్తలు