రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యారీ ప్రవర్తనపై విమర్శలు!

20 Sep, 2022 15:45 IST|Sakshi

లండన్‌: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రాణి అంత్యక్రియల్లో ఆమె మనవడు, కింగ్ చార్లెస్‌-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి.

రాణి భౌతికకాయం వెస్ట్‌మినిస్టర్‌ అబెలో ఉన్నప్పుడు ఆమెకు నివాళిగా అందరూ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను ఆలపించారు. అయితే డేగ కళ్లున్న కొందరు ఈ సమయంలో ప్రిన్స్ హ్యారీని వీడియో తీశారు. ఆయన పెదాలు కదపనట్లు, జాతీయ గీతం ఆలపించనట్లు అందులో కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.

ప్రిన్స్ హ్యారీ.. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని  ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకొందరు మాత్రం ప్రిన్స్ హ్యారీకి మద్దతుగా నిలిచారు. ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారని, పెదాలు కదిలాయని ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. మరొకరేమో.. జాతీయ గీతం మారింది కాబట్టి ఆయనకు కష్టంగా అన్పించిందేమో ఓ సారి అవకాశం ఇచ్చిచూద్దాం అన్నాడు. మరో నెటిజన్‌.. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది ప్రిన్స్ హ్యారీలాగే ప్రవర్తించారని, కింగ్ చార్లెస్ కూడా పెదాలు కదపలేదన్నారు. వాళ్లను పట్టించుకోకుండా ఈయనపైనే ఎందుకుపడ్డారని ప్రశ్నించాడు.

మరికొందరు మాత్రం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు నోట మాటరాదని, అందుకే ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాన్ని ఆలపించలేకపోయి ఉండవచ్చని ఆయనకు అండగా నిలిచారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు.
చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు

మరిన్ని వార్తలు