హ్యారీకి అవమానం

19 Sep, 2022 06:25 IST|Sakshi
విలియం భుజంపై మాత్రమే కన్పిస్తున్న ఈఆర్‌ చిహ్నం

సైనిక దుస్తులపై రాణి చిహ్నం తొలగింపు

లండన్‌: రాణి అస్తమయం నేపథ్యంలో విభేదాలు పక్కన పెట్టి దగ్గరవుతున్నారని భావించిన రాకుమారులు విలియం, హ్యారీ మధ్య దూరాన్ని మరింతగా పెంచే ఉదంతం తాజాగా చోటుచేసుకుంది. ఇది హ్యారీకి తీరని అవమానం కూడా మిగిల్చిందట. రాణి ఎలిజబెత్‌–2 మనవలు, మనవరాళ్లు శనివారం రాత్రి ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. విలియంతో పాటు హ్యారీ కూడా రాజు చార్లెస్‌–3 ప్రత్యేక అనుమతితో ఈ సందర్భంగా సైనిక దుస్తులు ధరించారు.

కానీ వాటిపై ఉండాల్సిన రాణి అధికార చిహ్నమైన ‘ఈఆర్‌’ను తొలగించారు. పెద్ద కుమారుడైన యువరాజు విలియం సైనిక దుస్తులపై మాత్రం ఈఆర్‌ చిహ్నం అలాగే ఉంచారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక హ్యారీకి గుండె పగిలినంత పనైందట. తండ్రితోనూ సోదరునితోనూ హ్యారీకి సత్సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. రాచకుటుంబం అభ్యంతరాలను కాదని ఆయన అమెరికా నటి మెగన్‌ మార్కెల్‌ను పెళ్లాడినప్పటినుంచీ విభేదాలు మరింతగా పెరిగాయి. ఈ నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదా వదులుకున్నారు.

దాంతో ఆయన సైనిక దుస్తులు ధరించే అర్హత కోల్పోయారు. ‘‘నాయనమ్మ అంత్యక్రియల సందర్భంగా ప్రత్యేక అనుమతితో వాటిని ధరిస్తే ఇంతటి అవమానం జరిగిందంటూ హ్యారీ కుమిలిపోయారు. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే చేసిన పనేనని భావిస్తున్నారు. ఎందుకంటే సైనిక దుస్తులు ధరించే అర్హత లేని ఎలిజబెత్‌–2 కుమారుడు ప్రిన్స్‌ ఆండ్రూ సైనిక దుస్తులపై కూడా అధికార చిహ్నాన్ని యథాతథంగా కొనసాగించారు.

కేవలం తన దుస్తులపై మాత్రమే తొలగించడం హ్యారీకి మరింత మనస్తాపం కలిగించింది’’ అని ఆయన మిత్రున్ని ఉటంకిస్తూ సండే టైమ్స్‌ కథనం పేర్కొంది. అంతేకాదు, ఆదివారం రాత్రి బకింగ్‌హాం ప్యాలెస్‌లో దేశాధినేతలకు చార్లెస్‌–3 అధికారిక విందు కార్యక్రమానికి కూడా హ్యారీ దంపతులను దూరంగా ఉంచారు. గురువారం హ్యారీ 38వ పుట్టిన రోజు. ఆ సందర్భంగా మెగన్‌తో కలిసి కార్లో వెళ్తుండగా విలియం తన ముగ్గురు పిల్లలను స్కూలు నుంచి కార్లో తీసుకొస్తూ ఎదురయ్యారు. ఇద్దరూ కార్ల అద్దాలు దించుకుని క్లుప్తంగా మాట్లాడుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారట. 

మరిన్ని వార్తలు