ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి.. ఏకంగా రూ.790 కోట్లు ఖర్చు

5 Jul, 2021 20:41 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: దేశాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా మానవ సమాజంలో వివాహ వ్యవస్థ పెనవేసుకుపోయింది. రెండు మనసులను.. రెండు కుటుంబాలను.. మూడు ముళ్లతో పెనవేస్తుంది వివాహ బంధం. అందుకే ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వివాహ వేడుక జీవితాంతం గుర్తిండిపోవాలని భావిస్తారు. అందుకోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడరు. నిశ్చితార్థం వేడుక నుంచి పెళ్లి తంతు ముగిసేవరకు ప్రతి వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని ఉవ్విళ్లురతారు. అందుకే తమ తమ స్థాయిలకు తగ్గట్లు.. కొన్ని సార్లు అంతకుమించే ఖర్చు చేస్తారు. అయితే కొన్ని పెళ్లి వేడుకలు ఖర్చు విషయంలో ఏకంగా చరిత్ర సృష్టించాయి. మరి ఆ వేడుకలు ఎక్కడ.. ఎవరింట జరిగాయి తదితర వివరాలు తెలియాలంటే ఇది చదవండి.. 

1.ప్రిన్సెస్‌ డయానా-చార్లెస్‌ వివాహ వేడుక
బ్రిటన్‌ రాజవంశంలోనే కాక.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా నిలిచింది డయానా-చార్లెస్‌ల పెళ్లి. 1981లో జరిగిన వీరి వివాహ వేడుక కోసం మొత్తం నగరాన్ని లైట్లతో దేదీప్యమానంగా అలంకరించారు. అప్పట్లోనే వీరి పెళ్లి కోసం ఏకంగా 48 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేశారు. ఇప్పటి లెక్కల్లో అది ఏకంగా 100 మిలియన్‌ డాలర్ల కన్న ఎక్కువ అనగా సుమారు 790 కోట్ల రూపాయలుగా ఉంటుంది. 

2. వనిషా మిట్టల్‌-అమిత్‌ భాటియా వివాహం
ప్రపంచ ఉక్కు రారాజు, ఇంగ్లండ్‌లోనే అత్యంత ధనవంతుడే కాక ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం సంపాదించుకున్న లక్ష్మి నివాస్‌ మిట్టల్‌ కుమార్తె వనిషా వివాహానికి ఏకంగా 55 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 408 కోట్లు) ఖర్చు చేశారు. 2004లో వనిషా-అమిత్‌ భాటియాల వివాహం పారిస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి  20వ శాతాబ్దపు అత్యంత ఖరీదైన వివాహ వేడుకగా చరిత్ర సృష్టించింది. 

3. ప్రిన్స్‌ విలియం-కేట్‌ మిడిల్‌టన్‌ల పెళ్లి వేడుక
ప్రపంచంలోనే మరో అత్యంత ఖరీదైన వివాహ వేడుక బ్రిటన్‌ రాజకుటుంబంలోనే జరిగింది. తల్లి డయానా బాటలోనే కుమారుడు ప్రిన్స్‌ విలియం వివాహం కూడా అత్యంత ఖరీదైన వేడుకగా నిలిచింది. ప్రిన్స్‌ విలియం-కేట్‌ మిడిల్‌టన్‌లు 29, ఏప్రిల్, 2011న వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి వేడుక కోసం 34 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మన కరెన్సీలో చెప్పాలంటే 244 కోట్ల రూపాయలన్నమాట.

4. ఇషా అంబానీ-ఆనంద్‌ పిరమాల్‌ వివాహం
ఆసియా కుబేరుడు, భారతదేశపు అతిపెద్ద వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ వివాహ వేడుక ఎంత వైభవంగా జరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, బాలీవుడ్‌ నటులు, రాజకీయ నాయకులు వీరి వివాహానికి అతిథులుగా హాజరయ్యారు. ఇషా-ఆనంద్ పిరమాల్‌ల వివాహం 12, డిసెంబర్, 2018 న జరిగింది. తన కుమార్తె వివాహం కోసం అంబానీ 100 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారని వార్తలు వినిపించగా.. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇషా-ఆనంద్‌ పిరమాల్‌ల వివాహ వ్యయం 15 మిలియన్ డాలర్లకు మించలేదని (దాదాపు 111 కోట్ల రూపాయలు) తెలిపింది.

5. లిజా మిన్నెల్లి-డేవిడ్ గెస్ట్‌ల వివాహం..
అమెరికన్ గాయని, నటి లిసా 2002 లో ఒక అమెరికన్ టీవీ షో నిర్మాత డేవిడ్ గెస్ట్‌ను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో వారిద్దరూ తమ వివాహానికి 3.5 మిలియన్ డాలర్లు (రూ .26 కోట్లు) ఖర్చు చేశారు.

6. ఎలిజబెత్ టేలర్-లారీ ఫోర్టెన్స్కీ
హాలీవుడ్ ప్రసిద్ధ నటీమణులలో ఒకరైన ఎలిజబెత్ టేలర్ 1991 లో లారీ ఫోర్టెన్స్కీ అనే భవన నిర్మాణ కార్మికుడిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఎలిజబెత్ స్నేహితుడు, పాప్‌ మహారాజు మైఖేల్ జాక్సన్, నెవర్‌ల్యాండ్ రాంచ్‌లో జరిగింది. వీరి వివాహ వేడుక కోసం 1.5 నుంచి 2 మిలియన్ డాలర్లు (రూ. 11-14 కోట్లు) ఖర్చు చేశారు. అయితే, వివాహం అయిన 5 సంవత్సరాలకే వారు విడాకులు తీసుకున్నారు.

 

మరిన్ని వార్తలు