మరోసారి ఫేస్‌బుక్‌ డేటా లీక్‌, 50 కోట్ల యూజర్లకు షాక్‌!

4 Apr, 2021 10:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్ యూజర్లూ జరభద్రం! మీ పర్సనల్‌ సమాచారాన్ని, ఫోన్‌ నంబర్‌ను  ఆన్‌లైన్‌లో వేలానికి ఉంచినట్లు తెలుస్తోంది. ఏకంగా 50 కోట్ల యూజర్ల ఫేస్‌బుక్ డేటా లీక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. హ్యాకర్ల కోసం ఫేస్‌బుక్‌ డేటాను ఓ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు ప్రచారం జరగుతోంది. అయితే  ఈ డేటా లీక్‌ విషయం చాలా పాతదే అయినా.. మరోసారి భారీ ఎత్తున డేటా  లీక్ అయిందన్న సమాచారం మాత్రం ప్రస్తుతం ఫేస్‌బుక్‌ యూజర్లలో  కలకలం రేపుతోంది. ఫేస్‌బుక్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వెబ్‌సైట్ల నుంచి ఈ డేటా సేకరించి ఆన్‌లైన్‌లో పెట్టినట్టు ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఇన్‌సైడర్ శనివారం తన కథనంలో పేర్కొంది.

కాగా, 106 దేశాల్లో ఫేస్‌బుక్ వాడుతున్నవారి ఫోన్ నెంబర్లు, ఫేస్‌బుక్ ఐడీలు, పూర్తి పేర్లు, లొకేషన్, పుట్టిన తేదీ, ఇమెయిల్ అడ్రస్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయని చెప్పుకొచ్చింది. ఫేస్‌బుక్‌ డేటా లీక్‌తో  సుమారు  1.1 కోట్ల యూజర్లు ప్రభావితమయ్యారని తెలిపింది. అయితే, ఫేస్‌బుక్ డేటా లీక్‌  సమస్య ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా ఉన్నదే. ఫేస్‌బుక్ 2018 లో ఫోన్ నెంబర్ల ద్వారా యూజర్లను సెర్చ్ చేసే ఆప్షన్‌ను తీసివేసింది.

కేంబ్రిడ్జ్ అనలిటికా వివాదం తర్వాత ఫేస్‌బుక్‌  ఈ నిర్ణయాన్ని  తీసుకుంది. కేంబ్రిడ్జ్ అనలిటికా 8.7 కోట్ల ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించిందన్న వార్తలు అప్పట్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఫేస్‌బుక్‌ లీక్ డేటా చాలా పాతదని, 2019లోనే తమకు సమాచారం అందిందని, 2019 ఆగస్టులోనే ఈ సమస్యను పరిష్కరించామని ఫేస్‌బుక్ క్లారిటీ ఇచ్చింది.

చదవండి: వెనుజులా అధ్యక్షుడి ఫేస్‌బుక్‌ ఖాతా నిలిపివేత..!

మరిన్ని వార్తలు