గాంధీజీ విగ్రహాన్నీ వదల్లేదు

20 Sep, 2020 04:38 IST|Sakshi

వాషింగ్టన్‌: నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణానంతరం హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను ‘బందిపోటు ముఠా’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించారు. చివరకు వారు, వాషింగ్టన్‌ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నీ విడిచిపెట్టలేదన్నారు. శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్‌ చౌవిన్‌ మే 25న జార్జ్‌ ఫ్లాయిడ్‌ మెడపైన మోకాలితో తొక్కిపట్టగా, ఊపిరాడక ఫ్లాయిడ్‌ మరణించారు. ఈ విషయం వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు.

దీనిపై, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో ట్రంప్‌ మాట్లాడారు. ఆందోళనకారులను ఉద్దేశించి ‘వారు అబ్రహం లింకన్‌ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రని వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. అందుకే విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించేలా ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు ట్రంప్‌ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందని ట్రంప్‌ అన్నారు. కూల్చి వేసిన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో పునర్‌నిర్మించినట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు