అసాంజే ఆత్మహత్యకు పాల్పడే అవకాశం..!

22 Sep, 2020 19:33 IST|Sakshi

సైకియాట్రిస్ట్‌  వ్యాఖ్యలు

లండన్‌: తనకు వింత శబ్దాలు, మ్యూజిక్‌ వినిపిస్తున్నాయని వికీలీక్స్‌ వ్యవస్ధాపకుడు జులియన్‌ అసాంజే తనతో చెప్పినట్లు సైకియాట్రిస్ట్‌ మైఖేల్‌ కోపెల్మన్‌ తెలిపారు. ఆయన భ్రమల్లో బతుకుతున్నారని, తీవ్రమైన డిప్రెషన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఏళ్ల తరబడి ఒకే గదికి పరిమితమైతే పరిస్థితి చేజారుతుందన్నారు. అసాంజేను అమెరికాకు అప్పగిస్తే ఆయన ఆత్మహత్యకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా అమెరికన్ సైనికులకు సంబంధించిన రహస్యాలను బయటపెట్టి అగ్రరాజ్యంలో ప్రకంపనలు పుట్టించిన వికీలీక్స్ అధినేత జులియన్ అసాంజే ప్రస్తుతం లండన్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి:  బిజినెస్ టైకూన్‌కు జైలు, భారీ జరిమానా)

ఈ నేపథ్యంలో అతడిపై గూఢచర్య ఆరోపణల కింద అభియోగాలు నమోదు చేసిన అమెరికా, అసాంజేను తమకు అప్పగించాల్సిందిగా బ్రిటన్‌ను కోరుతోంది. ఇందుకు సంబంధించి మంగళవారం ఓల్డ్‌ బెయిలీ కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా అమెరికా ప్రతినిధి జేమ్స్‌ లూయిస్‌ కోపెల్మన్‌ను ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించారు. అసాంజే మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదని, ఇటువంటి సమయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇందుకు బదులుగా, అసాంజే మాటలను నమ్మలేమని, అతడు అబద్ధం చెప్పి ఉండవచ్చు కదా అని జేమ్స్‌ వ్యాఖ్యానించారు. 

కాగా ఈ విషయంపై అసాంజే సహచరి స్టెల్లా మోరిస్‌ గతంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తాను భయపడినట్లుగా అసాంజే బలన్మరణం చెందితే తమ కొడుకులిద్దరు అనాథలై పోతారని ఆవేదన చెందారు. ఇక అమెరికాలో అసాంజేపై గూఢచర్య ఆరోపణల కింద నమోదైన అభియోగాలు రుజువైతే, ఆయనకు 175 ఏళ్ల శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అతడు సౌత్‌వెస్ట్‌ లండన్‌లో అత్యంత భద్రతతో కూడిన బెల్మార్స్‌ జైలులో ఉన్నాడు. ఇక సైక్రియార్టిస్ట్‌ కోపెల్మన్‌ ఇప్పటికే దాదాపు 20 సార్లు అసాంజేను ఇంటర్వ్యూ చేశాడు. వీటి ఆధారంగా ఆయన మానసిక స్థితిని అంచనా వేసి ఈ మేరకు కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు.

మరిన్ని వార్తలు