నేపాల్‌లో నాటకీయ పరిణామాలు.. ప్రధానిగా ‘ప్రచండ’ నియామకం

25 Dec, 2022 20:10 IST|Sakshi

కాఠ్మాండు: నేపాల్‌ రాజకీయాల్లో నాటకీయ పరిణామాల మధ్య ప్రధానమంత్రిగా సీపీఎన్‌-మావోయిస్ట్‌ సెంటర్‌ పార్టీ ఛైర్మన్‌ పుష్ప కమల్‌ దహాల్‌ ‘ప్రచండ’ ప్రధానిగా నియామకమయ్యారు. అధికార పంపకాలపై నేపాలీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు షేర్‌ బహదుర్‌ దేవ్‌బాతో జరిగిన చర్చలు విఫలమైన క్రమంలో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలితో జతకట్టారు ప్రచండ. ఓలితో పాటు విపక్షంలోని చిన్న చిన్న పార్టీలు ప్రచండకు మద్దతు ప్రకటించాయి. దీంతో తనకు 165 మంది చట్టసభ్యుల మద్దతు ఉందని నేపాల్‌ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారిని కలిశారు. అధికారం ఏర్పాటు చేసేందుకు అనుమతించాలని కోరారు.  ఈ క్రమంలో ఆయన్ను ప్రధానిగా నియమిస్తూ అధ్యక్షురాలు బిద్యా దేవి భండారి ఆదేశాలు జారీ చేశారు. 

సోమవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 76 క్లాజ్‌ 2 ప్రకారం నేపాల్‌ తదుపరి ప్రధానిగా ప్రచండను నియమించినట్లు అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అంతకు ముందు ఆదివారం సాయంత్రం 5 గంటల్లోనే చట్టసభ్యులు మెజారిటీని కూడగట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలని ప్రెసిడెంట్‌ కోరారు. గడువు ముగిసే సమయానికి కొద్ది గంటల ముందు ప్రచండ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. దీంతో ఆయనను నియమిస్తూ ప్రెసిడెంట్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేసింది.  

ప‍్రచండతో పాటు సీపీఎన్‌-యూఎంఎల్‌ ఛైర్మన్‌ కేపీ శర్మ ఓలి, రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ(ఆర్‌ఎస్‌పీ) ప్రెసిడెంట్‌ రవి లమిచ్చనే, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చీఫ్‌ రాజేంద్ర లింగ్దే సహా ఇతర నేతలు హాజరయ్యారు. ప్రచండకు మొత్తం 275 సభ్యుల్లో 165 మంది చట్టసభ్యుల మద్దతు లభించింది. అందులో సీపీఎన్‌-యూఎంఎల్‌ 78, సీపీఎన్‌-ఎంసీ 32, ఆర్‌ఎస్‌పీ 20, ఆర్‌పీపీ 14, జేఎస్‌పీ 12, జనమాత్‌ 6, నాగరిక్‌ ఉన్ముక్తి పార్టీ 3 సభ్యులు ఉన్నారు. నేపాల్‌ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు ప్రచండ. 

రొటేషన్‌ పద్ధతిపై ఒప్పందం..
నేపాల్‌ ప్రధాని పదవీ కాలం ఐదేళ్లు. పదవిని రొటేషన్‌ పద్ధతిలో చేపట్టాలని ఎన్నికలకు ముందు షేర్‌ బహదుర్‌ దేవ్‌బా, పుష్ప కమల్‌ దహాల్‌ మధ్య ఒప్పందం కుదిరింది. తొలి రెండున్నరేళ్లు తనకు పదవి ఇవ్వాలని ప్రచండ కోరగా.. అందుకు దేవ్‌బా నిరాకరించటంతో సంక్షోభం తలెత్తింది. విపక్ష కూటమితో చేతులు కలిపారు ప్రచండ, సహచర కమ్యూనిస్టు పార్టీ నేత, మాజీ ప్రధాని కేపీ శర్మ ఒలిని కలిశారు. రొటేషన్‌ పద్ధతిన ప్రధాని పదవిని పంచుకునేందుకు ఓలి అంగీకరించటంతో ప్రభుత్వ ఏర్పాటు, ప్రచండ ప్రధాని పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. 

ఇదీ చదవండి: ‘మా తల తీసేయమన్నా బాగుండేది’.. వర్శిటీల్లో నిషేధంపై అఫ్గాన్‌ మహిళల ఆవేదన

మరిన్ని వార్తలు