యుద్ధాన్ని ప్రారంభించింది పశ్చిమ దేశాలే: పుతిన్‌ సంచలన వ్యాఖ్యలు

21 Feb, 2023 16:02 IST|Sakshi

తమ దేశ పార్లమెంట్‌లో రష్యాను ఉద్దేశించి అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రసంగించారు. ఈ మేరకు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి ఏడాది కావొస్తున్న సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు పుతిన్‌. వాస్తవానికి తాము ఈ సమస్యను శాంతియుతం పరిష్కరించడానికి సాధ్యమైనంత మేర ప్రయత్నించామన్నారు. అంతేగాదు ఈ వివాదం నుంచి బయటపడేలా కూడా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. కానీ దీని వెనుక ఒక విభిన్నమైన కుట్ర దాగి ఉందని ఆరోపణలు గుప్పించారు పుతిన్‌.

ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాలే యుద్ధాన్ని ప్రారంభించాయని, దాన్ని ఆపడానికి రష్యా శాయశక్తులా ప్రయత్నం చేస్తోందన్నారు. అంతేగాదు పశ్చిమ దేశాలతో భద్రతా పరంగా దౌత్య మార్గాన్ని అనుసరించి సమస్యను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ  ఆ విషయంలో ఎటువంటి పారదర్శకత లేని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. ఆయా దేశాలు నాటో విస్తరణ కోసమే చూస్తున్నాయనే తప్ప.. శాంతియుత మార్గం కోసం ప్రయత్నం జరగడం లేదని విమర్శించారు.

ఉక్రెయిన్‌కు అణ్వాయుధాలు, పశ్చిమ దేశాలు, నాటో దేశాలు సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. అలాగే గతేడాది నుంచి ఉక్రెయిన్‌కు సైనిక సాయం చేస్తున్న దేశం పేరు చెప్పకుండానే అమెరికాను పరోక్షంగా పుతిన్‌ హెచ్చరించారు. ఉక్రెయిన్‌కు ఎంత ఎక్కువగా ఆయుధాల పంపితే అంత ఎక్కువ కాలం రష్యా దాడి చేస్తుందని హెచ్చరించారు.  అంతేగాదు ఉక్రెయిన్‌లో ప్రజలు పాశ్చాత్య యజమానులకు బందీలుగా మారారని, వారికంటూ వ్యక్తిగతం లేదని విమర్శించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ పాలన వారికి జాతీయ ప్రయోజనాలను అందించడం లేదన్నారు.

రష్యాకు వ్యతిరేక చర్యలు చేపట్టేందుకు ఉక్రెయిన్‌ వివిధ మార్గాలను అన్వేషిస్తుందని, ముఖ్యంగా నాజీలు, ఉగ్రవాదులను సైతం ఉపయోగిస్తోందని ఆరోపించారు. ఉక్రెయిన్‌ దళాల్లో నాజీ యూనిట్లు కూడా ఉన్నాయని చెప్పారు. రష్యా ప్రజలను రక్షించాలని, వారి ఇళ్లను రక్షించాలని కోరుకుంటోందన్నారు. కానీ పాశ్చాత్య నాయకులు వివాదాన్ని మరింత ముదిరిలే చేసేందుకు ఆర్థిక, సైనిక సాయాన్ని చేస్తున్నాయంటూ పుతిన్‌ మండిపడ్డారు. తాము దశలవారిగా లక్ష్యాలను చేధించుకుంటూ ఒక క్రమపద్ధతిలో ఉక్రెయిన్‌పై దాడి చేస్తూ.. ఈ సమస్యను పరిష్కారిస్తామని ధీమాగా చెప్పారు పుతిన్‌.

(చదవండి: తగ్గేదేలే! అంటూ ..ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు..48 గంటల్లోనే మరో క్షిపణి ప్రయోగం)

మరిన్ని వార్తలు